నెలరోజుల పాటు మజ్జిగ పంపిణీ…
నెలరోజుల పాటు మజ్జిగ పంపిణీ…
పాయకాపురం, ఆంధ్రప్రభ : స్థానిక64వ డివిజన్ టీడీపీ అధ్యక్ష, కమిటీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా కండ్రికలో టీడీపీ కార్యాలయంలో అధ్యక్షుడు కె.రవికుమార్ కమిటీ సభ్యులు సోమవారం పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్,పార్టీ ఉపాధ్యక్షుడు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రవికుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా మండిపోతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మజ్జిగ, మంచినీరు అందజేయడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం వడగాల్పులపై ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తూ, ఉష్ణోగ్రత అంచనాలను ప్రజలకు మెసేజ్‌ల ద్వారా తెలియజేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవసరమైన సూచనలు అందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులు,కార్మికులు, ఆటో డ్రైవర్లు, రోడ్డుపై పనిచేసే మహిళలకు,వృద్దులకు, దివ్యాంగులకు మజ్జిగ, చల్లని తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఎండ తీవ్రత మధ్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఈ సేవా కార్యక్రమాలు నెల రోజులు పాటు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్. కె బాబు, కోమరి రాజేష్,కె. హర్ష తదితరులు పాల్గొన్నారు.
