ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలు
ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలు
ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్
రూ.8.10 లక్షల దొంగసొత్తు స్వాధీనం
చిత్తూరు, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై ప్రభుత్వ సచివాలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.8,10,400 విలువైన 30 ప్రింటర్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఒక ద్విచక్ర వాహనం, నేరాలకు ఉపయోగించిన కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మొత్తం 18 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

చిత్తూరు జిల్లా ఎస్‌పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు నగరి ఇన్‌చార్జ్ డీఎస్పీ జె. రామ్‌బాబు పర్యవేక్షణలో కార్వేటినగరం సీఐ, ఎస్.ఆర్.పురం ఎస్‌ఐ, సిబ్బంది ఆదివారం ఎస్.ఆర్.పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్తూరు–తిరుపతి ప్రధాన రహదారిపై మఠం క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు పలు ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అరెస్ట్ అయిన నిందితుడు సి. మహేష్‌బాబు (22), తండ్రి దొరబాబు, ఎస్.ఆర్.పురం మండలం కన్యాకాపురం గ్రామానికి చెందినవాడు.

ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటున్నాడు. అతని వద్ద ఒక ప్రింటర్ ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేసి విచారణ చేపట్టారు. అనంతరం అతని వద్ద నుండి 30 దొంగిలించిన ప్రింటర్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, గ్లామర్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుడు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని ప్రభుత్వ సచివాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది. రాత్రి వేళల్లో కార్యాలయాల తలుపులను కట్టర్‌తో పగులగొట్టి లోపలికి ప్రవేశించి ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించేవాడని పోలీసులు తెలిపారు. దొంగిలించిన వస్తువులను తక్కువ ధరలకు విక్రయించి వచ్చిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, విలాసవంతమైన జీవనానికి ఖర్చు చేసేవాడని విచారణలో బయటపడింది.
దొంగిలించిన ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లను ఓ ఎల్ ఎక్స్ యాప్ లో సెకండ్‌హ్యాండ్ వస్తువులుగా అప్‌లోడ్ చేసి అమ్మేవాడని, తక్కువ ధరకు లభించడంతో కొనుగోలుదారులు సులభంగా కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోని ఎస్.ఆర్.పురం, వేదురుకుప్పం, గుడిపాల, జీడీ నెల్లూరు మండలాల్లోని పలు గ్రామ సచివాలయాల్లో అతడు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి జిల్లాలోని పాకాల, వడమాలపేట మండలాలు, ఎం.ఆర్.పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసులు నమోదయ్యాయి. అలాగే అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని దొడ్డిపల్లి సచివాలయంలో జరిగిన చోరీలో కూడా అతని ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.6,50,544 విలువైన 30 హెచ్‌పీ, ఎప్సన్ కంపెనీల ప్రింటర్లు, రూ.1,59,866 విలువైన మూడు ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. మొత్తం దొంగసొత్తు విలువ సుమారు రూ.8.10 లక్షలుగా అంచనా వేశారు. నిందితుడు ఇంజినీరింగ్ విద్యార్థి అయినప్పటికీ ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలు చేయడం ద్వారా అంతర్‌జిల్లా స్థాయిలో నేరాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. ఈ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన కార్వేటినగరం సీఐ వై. హనుమంతప్ప, ఎస్.ఆర్.పురం ఎస్‌ఐ వి. సుమన్, పోలీసు సిబ్బంది లోకనాథం, రాజశేఖర్, బాలయ్య, శరత్, వజ్రవేలు, యువరాజ్‌లను జిల్లా ఎస్‌పీ అభినందించారు.
