వైద్య సేవల్లో కర్నూలుకు ‘ఏ’ గ్రేడ్
వైద్య సేవల్లో కర్నూలుకు ‘ఏ’ గ్రేడ్
హాస్పిటల్ యాక్టివిటీ ఇండికేటర్..
గణనలో జిల్లా ప్రతిభ…
ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు సహా పలు ఆసుపత్రులకు అత్యుత్తమ రేటింగ్…
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో వైద్య సేవలు మరింత మెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. సెకండరీ హెల్త్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును అంచనా వేస్తూ నిర్వహించిన హాస్పిటల్ యాక్టివిటీ ఇండికేటర్ (HAI) గణనలో జిల్లా సమగ్రంగా ‘A’ గ్రేడ్ సాధించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు నిర్వహించిన గణనలో నిర్దేశించిన లక్ష్యాలను కర్నూలు జిల్లా ఆసుపత్రులు సమర్థవంతంగా చేరుకోవడంతో ఈ గుర్తింపు లభించినట్లు కలెక్టర్ తెలిపారు.
ముఖ్యంగా ఓపీ సేవలు, ఐపీ చికిత్సలు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, బెడ్ ఆక్యుపెన్సీ తదితర కీలక సూచికల్లో మెరుగైన పనితీరు కనబరిచినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి (ఆదోని), ప్రాంతీయ వైద్యశాల (ఎమ్మిగనూరు), సామాజిక ఆరోగ్య కేంద్రాలు కోడుమూరు, వెల్దుర్తి, పత్తికొండ, ఆలూరు ఆసుపత్రులకు ‘A’ గ్రేడ్ లభించిందని కలెక్టర్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య సేవలు మెరుగుపడుతున్నాయనే దానికి ఈ ఫలితాలు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
అదేవిధంగా ఓర్వకల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి ‘B’ గ్రేడ్ లభించిందని తెలిపారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో మౌలిక వసతులు, సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించామని, రాబోయే రోజుల్లో ఓర్వకల్ ఆసుపత్రిని కూడా ‘A’ గ్రేడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు.
ప్రజలకు సమయానికి నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన సదుపాయాలు, వైద్య సిబ్బంది సమన్వయం, సేవల పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ వైద్య రంగం సాధించిన ఈ విజయంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఆరోగ్య సేవలను సమర్థవంతంగా విస్తరించడంలో కర్నూలు జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
