సీపీని కలిసిన ఎమ్మెల్యేలు

సీపీని కలిసిన ఎమ్మెల్యేలు

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ: ఓరుగల్లు సభలో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ చేసిన కంట్రీ వర్సీ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన నేతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను బుధవారం వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు, హనుమకొండ,వరంగల్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి,అయూబ్ లు కలిసి కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు హంటర్ రోడ్డులో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతారాహిత్యంగా, అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎత్తి చూపారు.చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సంబంధించిన అన్ని సెక్షన్ల కింద వెంటనే కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

ప్రజల్లో విద్వేషం రేకెత్తించేలా, వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు నష్టం కలిగించేలా చేసిన ఈ వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను కోరారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు కోరారు.

Leave a Reply