ఇంద్రవెల్లిలో బీజేపీ శ్రేణుల సంబరాలు

ఇంద్రవెల్లిలో బీజేపీ శ్రేణుల సంబరాలు
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ: పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం వంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన సత్తా చాటడంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. సోమవారం ఆదిలాబాద్ – ఉట్నూరు ప్రధాన రహదారిపై టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పలువురు బీజేపీ వక్తలు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘సబ్కా సాత్ – సబ్కా వికాస్’ నినాదం దేశవ్యాప్తంగా ప్రజల్లోకి బలంగా వెళ్లిందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల రూపురేఖలు మారుతున్నాయని, మోదీ విదేశాంగ నీతి వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠ పెరిగిందని కొనియాడారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ, విదేశాంగ నీతితో దేశానికి ఇంధన సరఫరాలో ఆటంకం కలగకుండా చూస్తున్నారని నేతలు తెలిపారు. నిత్యావసరాల ధరలు పెరిగినప్పటికీ, గత ఐదేళ్లుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను అదుపులో ఉంచి ప్రజలపై భారం పడకుండా మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని వారు చెప్పారు. తెలంగాణ ప్రజలు సైతం ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ మార్పును కోరుకుంటున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు.
ఈ సంబరాల్లో అసెంబ్లీ కో-కన్వీనర్ అరెల్లి రాజలింగు, బీజేపీ మండల అధ్యక్షులు బాలాజీ కేంద్రీ, జిల్లా నాయకులు అరక ఖమ్ము, మాజీ ఎంపీపీ తుకారాం పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా నాయకురాలు రాథోడ్ రాధిక, జిల్లా నాయకుడు దీపక్ సింగ్ షెకావత్, సీనియర్ నాయకులు హెచ్.కె అనిల్, మాజీ ఎంపీటీసీ కనక హనుమంతరావు, జిల్లా నాయకులు దిలీప్ మోరే , పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
