రీల్స్ కోసం ప్రాణాలు కోల్పోతున్న యువత

రీల్స్ కోసం ప్రాణాలు కోల్పోతున్న యువత
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సోషల్ మీడియా ప్రమాదాలు ఇటీవల పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే పిచ్చితో యువత ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తున్నారు. రైళ్లకు అడ్డంగా వెళ్లడం, కొండలు, గుట్టలు ఎక్కి లోయల పక్కన ఫొటోలు దిగడం, జలపాతాల దగ్గర ఆటలాడడం, బిల్డింగ్‌లపైకి ఎక్కి దూకడం, బైక్‌లపై రోడ్ల మీద స్టంట్లు చేయడం, కార్లు, బైక్‌లను వంద కిలోమీటర్ల వేగంతో నడపడం.. లాంటివి చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నిసార్లు ఇతరుల ప్రాణాలు పోవడానికీ కారణమవుతున్నారు. వ్యూస్, లైక్స్, కామెంట్ల వెర్రితో ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలూ తీస్తున్నారు.
•2026 ఏప్రిల్.. హైదరాబాద్‌లోని మల్లాపూర్ బస్తీలో బిహార్‌కు చెందిన బాలుడు మిథున్ (14) బాల్కనీ గోడపై రీల్స్ చేస్తూ పట్టుతప్పి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు.
- 2024 జూలై.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు బైక్‌పై స్టంట్స్ చేస్తూ అదుపుతప్పి కిందపడిపోయారు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
- 2024 జనవరి.. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు స్నేహితులు కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లారు. రిజర్వాయర్‌లో సెల్ఫీలు దిగుతున్న సమయంలో ఒకరు జారిపడి నీళ్లలో మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన మరికొందరూ ప్రమాదానికి గురై మొత్తం ఐదుగురు చనిపోయారు.
- 2023 మే.. హైదరాబాద్‌కు చెందిన మైనర్ మహమ్మద్ సర్ఫరాజ్ (16) ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం స్నేహితులతో కలిసి సనత్‌నగర్‌లోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లాడు. రీల్స్ తీస్తున్న సమయంలో ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొని చనిపోయాడు. ఇలా ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదాలకు కారణాలివీ..
డిజిటల్ డోపమైన్:
వీడియోలకు వచ్చే ప్రతి లైక్, కామెంట్ రీల్స్ చేసేవాళ్లకు ఉత్సాహం ఇస్తుంది. దీని ద్వారా మెదడులో డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒక రకమైన వ్యసనంగా మారి, అంతకంటే ఎక్కువ గుర్తింపు కోసం మరిన్ని ప్రమాదకరమైన పనులు చేసేలా ప్రేరేపిస్తుంది.
పక్కవాళ్లతో పోల్చుకోవడం:
పక్కవాళ్లు వైరల్ అవుతుంటే, మనం కూడా ఏదో ఒకటి విభిన్నంగా చేయాలనే ఒత్తిడి యువతలో పెరుగుతోంది.
‘నాకేం కాదులే’ అనే అతి విశ్వాసం:
చాలామంది యువతీ యువకులు ఈ అతి విశ్వాసంతో ఉంటున్నారు. ఒక్క చిన్న పొరపాటు ప్రాణం తీస్తుందని వారు గ్రహించలేకపోతున్నారు.
నిఘా లేకపోవడం:
ప్రమాదకర ప్రదేశాల్లో హెచ్చరికలు ఉన్నప్పటికీ సరైన భద్రత లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణం అవుతోంది.
సోషల్ మీడియా జాడ్యానికి అదే పునాది
యువత సోషల్ మీడియాకు అడిక్ట్ కావడానికి తల్లిదండ్రులే మొదటి కారణం. చిన్నప్పటి నుంచే ఫోన్లు ఇవ్వడం వల్ల పిల్లలు అదే ప్రభావంలో పెరుగుతున్నారు. ఫేమస్ అవ్వాలనే ఆతృతతో వినూత్నంగా ఏదో చేయాలని ఆలోచిస్తూ, ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
‘హుక్’ – రీల్స్ మానసికత
ఒక వీడియోను చూసి అది నచ్చిందో లేదో నిర్ణయించుకోవడానికి సగటున 7 సెకన్లు పడుతుంది. అందుకే మొదటి 3 నుంచి 5 సెకన్లలోనే షాకింగ్ లేదా ఆకర్షణీయమైన విషయాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు.
‘టిక్టాక్ బ్రెయిన్’ ప్రభావం
నిరంతరం రీల్స్ చూడటం వల్ల యువతలో అటెన్షన్ స్పాన్ తగ్గిపోతోంది. పుస్తకాలు చదవడం లేదా ఎక్కువసేపు వినడం కష్టంగా మారుతోంది.
మంటగలుస్తున్న మానవత్వం
సోషల్ మీడియా పిచ్చితో సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. ప్రమాదంలో ఉన్న వారిని కాపాడటానికి బదులు వీడియోలు తీస్తున్నారు. ఈ ధోరణిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సమాజానికి ప్రమాదకరం అని ఆయన అన్నారు.
నివారణ చర్యలివే
సోషల్ మీడియా ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియా సంస్థలు కంటెంట్‌ను ఫిల్టర్ చేయాలి. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలి. ప్రమాదకర వీడియోలపై హెచ్చరికలు ఇవ్వాలి. రీల్స్ పేరుతో ప్రమాదకరంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టూరిస్ట్ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలి.
