30thaprilsplstory | అమెరికా దిగ్బంధనం – ఇరాన్‌ పై ఒత్తిడి

30thaprilsplstory | అమెరికా దిగ్బంధనం – ఇరాన్‌ పై ఒత్తిడి

30thaprilsplstory | హార్మూజ్ జలసంధి సంక్షోభం ప్రభావం
చమురు మార్కెట్లపై యుద్ధ ప్రభావం
చరిత్రలో నౌకా దిగ్బంధనాల పాత్ర
భారత్ నేర్చుకోవాల్సిన రక్షణ పాఠాలు

30thaprilsplstory | ఇరాన్ యుద్ధం గురించి మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా ఇరాన్ యోధులు జరుపుతున్న పోరాటానికి చాలా మంది అభినందిస్తున్నారు. ఇరాన్ ఒక్కటే కాదు. ఆ దేశం తరఫున చైనా, రష్యా, ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి ఇజ్రాయెల్, పలు అరబ్ దేశాలు, యూరప్‌లోని కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇరాన్ యుద్ధం గత ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైంది. త్వరగా ముగుస్తుందని అందరూ భావించినప్పటికీ, ఇప్పటికీ అది కొనసాగుతోంది. ప్రస్తుతం తాత్కాలిక సంధి అమలులో ఉంది. పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చల్లో అమెరికా, ఇరాన్ పాల్గొంటున్నాయి. యుద్ధ సమయంలో ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ప్రపంచంలో వినియోగించే చమురులో సుమారు 20 శాతం ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది.

ఇరాన్ ఈ ప్రకటన చేసిన వెంటనే, ఈ మార్గంలో వెళ్తున్న చమురు ట్యాంకర్లపై దాడులు జరిగే అవకాశం ఉందన్న భయాలు వ్యక్తమయ్యాయి. సముద్ర గర్భంలో ఉన్న మందుపాతరలను పేల్చే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా పెరిగింది. నౌకాయానం ప్రమాదకరంగా మారడంతో ఇన్స్యూరెన్స్ కంపెనీలు భీమా కల్పించేందుకు వెనుకంజ వేస్తున్నాయి. ఇరాన్ చమురు రవాణాను అడ్డుకోవడం ద్వారా ప్రపంచ దేశాలపై ఒత్తిడి తీసుకురావాలన్నదే తమ లక్ష్యం అని ప్రకటించింది. ఈ యుద్ధాన్ని ఆపాలని అనేక దేశాలు విజ్ఞప్తి చేశాయి.

పాకిస్తాన్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో అమెరికా హార్మూజ్ జలసంధిలో నౌకల దిగ్బంధనం ప్రారంభించింది. ఈ చర్య ఇరాన్‌కు పెద్ద దెబ్బగా మారింది. అమెరికా దిగ్బంధనాలను ఎత్తేస్తేనే చర్చలకు వస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే అమెరికా ఇందుకు నిరాకరించింది. ఇరాన్‌ను ఒత్తిడికి గురిచేయడానికి ఇదే శక్తివంతమైన సాధనం అని భావించింది. ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. రోజువారీ ఆదాయం తగ్గిపోయింది. చమురు వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. నౌకల దిగ్బంధనం యుద్ధాలలో శక్తివంతమైన సాధనంగా చరిత్ర చెబుతోంది. రవాణా వ్యవస్థ స్తంభించి దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి.

చరిత్రలో ప్రముఖ దిగ్బంధనాలు:

  1. 1860–1864 మధ్య అమెరికా సివిల్ వార్ సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు సరఫరాలు నిలిచిపోయాయి.
  2. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీపై బ్రిటన్ దిగ్బంధనం వల్ల ముడి సరుకుల కొరత ఏర్పడింది.
  3. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్‌పై దిగ్బంధనం తీవ్ర ప్రభావం చూపింది.
  4. 1962లో క్యూబా క్షిపణి సంక్షోభంలో అమెరికా దిగ్బంధనం కీలకమైంది.

ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే, ఇరాన్ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. హార్మూజ్ జలసంధిని మూసివేస్తే ఇతర దేశాలు అమెరికాపై ఒత్తిడి తెస్తాయని ఇరాన్ భావించింది. కానీ అమెరికా ప్రత్యక్షంగా దిగ్బంధనానికి దిగుతుందని ఊహించలేదు. అమెరికా చర్యల వల్ల ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే దిగ్బంధనం ద్వారా ఫలితం సాధ్యమని అమెరికా భావిస్తోంది.

ముగింపు

హార్మూజ్ జలసంధి పరిణామాలు ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్గాలపై నియంత్రణ తాత్కాలిక ప్రయోజనాలనే ఇస్తుంది. ఇరాన్ వ్యూహం పూర్తిగా ఫలించలేదు. అమెరికా దిగ్బంధనం మరింత ప్రభావవంతమైంది.

భారత్ నేర్చుకోవాల్సినవి

ఇరాన్ యుద్ధం భారత్‌కు కొత్త పాఠాలను నేర్పుతోంది. ఆధునిక యుద్ధ విధానాలు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులపై ఆధారపడుతున్నాయి. వీటిని ఎదుర్కొనే సాంకేతిక సామర్థ్యం పెంచుకోవాలి. భారత్ తన రక్షణ వ్యూహాలను ఆధునీకరించాలి. చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి వచ్చే ముప్పులను ముందుగానే అంచనా వేసి సిద్ధంగా ఉండాలి. డ్రోన్లు, క్షిపణి దాడులను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలి. చమురు, గ్యాస్ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ వనరులను అభివృద్ధి చేయాలి. పాత యుద్ధ వ్యూహాల స్థానంలో కొత్త వ్యూహాలను అవలంబించడం అత్యవసరం.

డా. పెంటపాటి పుల్లారావు

Leave a Reply