MLA | త్వరలోనే రబీ ధాన్యం కొనుగోళ్లు..

MLA | త్వరలోనే రబీ ధాన్యం కొనుగోళ్లు..
రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు..
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .
MLA | రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రెడ్డిగూడెంలో అతిత్వరలోనే రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు రైతులకు భరోసానిచ్చారు.
రెడ్డిగూడెంలో మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బారులో పలువురు రైతులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన స్థానిక రైతులతో కలిసి ధాన్యపు రాశులను పరిశీలించారు. వెంటనే ఎన్టీఆర్ జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ సతీష్ ఫోన్లో మాట్లాడి ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ రెడ్డిగూడెంలో రబీ ధాన్యాన్ని మూడు రోజుల వ్యవధిలోనే కొనుగోలు చేస్తామన్నారు. ఆర్‌ఎస్‌కేల పరిధిలో ఈ-క్రాప్ నమోదు చేసుకున్న రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించి, మద్దతు ధర గ్రేడ్-ఏ రకం ధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకం రూ.2,369 చెల్లించనున్నట్లు వెల్లడించారు. తేమశాతం, తూకాల్లో తేడాలు రాకుండా చర్యలు తీసుకోవాలని, ఒక్క కిలో కూడా తారం తీయవద్దని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల వ్యవస్థకు ఆస్కారం లేదన్నారు. ధాన్యం కొనుగోలుకు కావలసిన గన్ని బ్యాగులు ఆర్ ఎస్ కే సిబ్బంది, ధాన్యం రవాణా చేసే వాహనాలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
