TG | చంద్ర‌బాబు, కెసిఆర్ ల తొలి అడుగులు యూత్ కాంగ్రెస్ నుంచే – రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ః ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు , తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లు సైతం యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి నేత‌ల‌య్యార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సీనియ‌ర్ నేత వి హనుమంతరావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్‌లో పని చేశారని రేవంత్ గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అక్కడ్నుంచే వచ్చారని పేర్కొన్నారు.

తెలంగాణ యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను నేడు హైదరాబాద్ గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ, రాజకీయాలకు యూత్ కాంగ్రెస్ అనేది మొదటిమెట్టని ఆయన చెప్పుకొచ్చారు. పదవులు వచ్చినా, రాకపోయినా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలని సూచించారు.
.”తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. పేదల ఆత్మగౌరవం కోసం ఇళ్లు కట్టిస్తున్నాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ పేరుతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారు. ఆయన మోసం చేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. స్థానిక సంస్థల్లో యూత్‌ కాంగ్రెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇస్తాం. ఫ్లెక్సీలు కట్టి దండాలు పెట్టేవారికి పదవులు రావు. ఢిల్లీ నుంచి కాదు.. గల్లీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తాం. దేశంలోనే ఎవరూ చేయనంత రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి చేశాం.

భూమి లేని వారికీ రూ.12 వేలు ఇస్తున్నాం. 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసి చూపించాం. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను యూత్ కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికల్లో డబ్బుతో ఎవరూ గెలవలేరు. మేము ప్రజాభిమానంతో గెలిచాం. డబ్బులే గెలిపిస్తాయంటే కేసీఆర్‌కు 100 సీట్లు వచ్చి ఉండేవి. కొడితే గట్టిగా కొడతామని కేసీఆర్‌ అంటున్నారు. కేసీఆర్‌ను కొట్టాలంటే కేటీఆర్‌, కవిత, హరీశ్‌నే కొట్టాలి. కేసీఆర్‌ను కేటీఆర్‌ ఓడించారు, కేజ్రీవాల్‌ను కవిత ఓడించింది. కల్వకుంట్ల కుటుంబం అవినీతి చూసే ప్రజలు బుద్ధి చెప్పారు. దేశంలో కులగణన చేసిన ఏకైక ప్రభుత్వం మాది” అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *