TG Politics | బీఆర్‌ఎస్ సిద్ధాంతం ఇదే…

TG Politics | బీఆర్‌ఎస్ సిద్ధాంతం ఇదే…

TG Politics | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్ పార్టీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఫామ్‌హౌస్‌లో పెద్ద సార్ ఉండాలే.. చిన్న సార్ సీఎం కావాలే.. ఇదే బీఆర్‌ఎస్ సిద్ధాంతం” అంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ను ప్రకటించిన అనంతరం ప్రజా సభలో మాట్లాడిన కవిత, బీఆర్‌ఎస్ ప్రస్తుత పరిస్థితిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం ప్రజల కోసం ప్రారంభమైందని, కానీ తర్వాత అది కుటుంబ పాలనకు పరిమితమైందని ఆరోపించారు.
“ఫామ్‌హౌస్‌లో పెద్ద సార్ ఉండాలే.. చిన్న సార్ సీఎం కావాలే.. ఇదే ఇప్పుడు బీఆర్‌ఎస్ సిద్ధాంతంగా మారింది” అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన నాయకత్వం ప్రజలకు దూరమైందని, తెలంగాణ ఆత్మను పార్టీ కోల్పోయిందని విమర్శించారు.
రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ రథం దారితప్పిందని, సామాజిక తెలంగాణ లక్ష్యం మధ్యలోనే ఆగిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుక దందా కోసం కేటీఆర్ దళితులను చంపిండు,ఇసుక మీద ప్రేమతో దళితులను కొట్టించిండు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన బ్రతుకులు బాగుపడుతవి అనుకున్నాం కానీ మన రాష్ట్రంలో మన రైతులకు కేసీఆర్ బేడీలు వేసిండు. ఇందుకోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది అని ప్రశ్నించారు. కేసీఆర్ మన మనిషి కాదు, కనికరం లేని మరమనిషి.. అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకున్న నాయకుడు.
ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా ప్రజల కలలు నెరవేరలేదని అన్నారు. ప్రజలకు అవసరమైనది కుటుంబ వారసత్వ రాజకీయాలు కాదని, బాధ్యతాయుతమైన పాలన అని కవిత స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, యువత కోసం నిజమైన ప్రాంతీయ పార్టీ అవసరమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజల ఆశయాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తామని, తాను ప్రజలకు ‘అమ్మ’లా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలపై నేరుగా పోరాడే రాజకీయమే తన లక్ష్యమని కవిత వెల్లడించారు.