ఇంద్రకీలాద్రిపై ఆకస్మిక తనిఖీలు

ఇంద్రకీలాద్రిపై ఆకస్మిక తనిఖీలు

-పారిశుధ్యంపై ఈఓ క్షేత్రస్థాయి పరిశీలన
-ఉపాలయాలు, శివాలయం పరిసరాల్లో స్వయంగా పరిశీలన
-వ్యర్థాల తొలగింపుకు తక్షణ ఆదేశాలు
-పారిశుధ్యమే ప్రథమ ప్రాధాన్యం అని ఈఓ స్పష్టం
-భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహణపై దృష్టి

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈఓ శీనా నాయక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జరిగిన ఈ పరిశీలనలో ఆలయ పరిసరాల్లో శుభ్రత ప్రమాణాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ పారిశుధ్య నిర్వహణను కట్టుదిట్టం చేయాలని అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఈఓ వి.కే. సీనా నాయక్ రాత్రి వేళల్లోనే ఆకస్మికంగా ఆలయాన్ని సందర్శించి ఉపాలయాలు, శివాలయం పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు.

తనిఖీ సందర్భంగా ఆలయ ఆవరణలో కొన్ని ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను గమనించిన ఈఓ, వెంటనే వాటిని తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. పనులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షించడం ప్రత్యేకంగా నిలిచింది. భక్తుల ఆరోగ్యం, ఆలయ పవిత్రత రెండూ సమానంగా ముఖ్యం. అందుకే పారిశుధ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదు” అని ఈఓ స్పష్టం చేశారు. పండుగల సమయంలో మాత్రమే కాకుండా, ప్రతిరోజూ అత్యున్నత ప్రమాణాలతో శుభ్రత నిర్వహణ ఉండాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాలని, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఆలయ సిబ్బంది ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఇక భక్తులు కూడా ఆలయ పరిశుభ్రతలో భాగస్వాములవ్వాలని ఈఓ కోరారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లో వేయాలని సూచించారు. ముందు ముందు కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, ఆలయ పవిత్రతను కాపాడుతూ భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శనం కల్పించడమే లక్ష్యమని ఆలయ అధికారులు వెల్లడించారు.

Leave a Reply