Rs61cr | ఏపీ మహిళకు అదిరిపోయే శుభవార్త

Rs61cr | ఏపీ మహిళకు అదిరిపోయే శుభవార్త
Rs61cr | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపికబురు అందించేందుకు సిద్ధమైంది. జూన్ నెల నుంచి అర్హులైన వితంతువులకు కొత్తగా ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ల’ను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి రెండేళ్లు జూన్ 12 నాటికి పూర్తవుతున్న సందర్భంగా ఈ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.
సెర్ప్ (SERP) అంచనాల ప్రకారం..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.53 లక్షల మంది అర్హులైన వితంతువులను గుర్తించారు. వీరందరికీ ఒకేసారి పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు నెలకు రూ. 4,000 చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
ప్రభుత్వంపై అదనపు భారం..
ఈ కొత్త పింఛన్ల మంజూరు వల్ల రాష్ట్ర ఖజానాపై నెలకు సుమారు రూ. 61 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో ‘స్పౌజ్ కేటగిరీ’ కింద ఒక విధానం అమలవుతోంది. ఎవరైనా వృద్ధాప్య లేదా ఇతర పింఛను తీసుకుంటున్న వ్యక్తి చనిపోతే, ఆ తర్వాతి నెల నుంచి వారి జీవిత భాగస్వామికి ప్రభుత్వం ఆ పింఛనును బదిలీ చేస్తోంది. ఇలా ఇప్పటికే సుమారు 2.30 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చారు. అయితే, 60 ఏళ్ల లోపు వయసు ఉండి, ఎలాంటి ప్రభుత్వ పింఛను అందని పురుషులు మరణిస్తే.. వారి భార్యలకు సామాజిక భద్రత కరువవుతోంది. ఇలాంటి వారికి ఆర్థిక భరోసా కల్పించాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తుల మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వితంతు కేటగిరీలో ఈ పెండింగ్ దరఖాస్తులన్నింటినీ ఒకేసారి పరిష్కరించాలని ఆదేశించారు.
వితంతువుల తర్వాత దివ్యాంగులకు..
వితంతువుల దరఖాస్తులను పరిష్కరించిన వెంటనే, అర్హులైన దివ్యాంగులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత రెండేళ్ల వ్యవధిలో దాదాపు లక్ష మందికి పైగా కొత్తగా వైకల్య ధృవీకరణ పత్రాలు పొంది పింఛను కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి కూడా త్వరలోనే మోక్షం లభించనుంది.
దరఖాస్తు విధానం.. కావాల్సిన ప్రధాన పత్రాలు..
కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాలను సంప్రదించి దరఖాస్తు ఫారం సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వెరిఫికేషన్ ప్రక్రియ సచివాలయాల ద్వారా దాదాపు పూర్తయింది.
అర్హతలు & పత్రాలు…
- దరఖాస్తుదారు కుటుంబం దారిద్య్రరేఖకు దిగువన (BPL/తెల్ల రేషన్ కార్డు) ఉండాలి.
- భర్త మరణ ధృవీకరణ పత్రం (Death Certificate) తప్పనిసరి. - కనీస వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి (వయసు ధృవీకరణ పత్రం).
- ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో.
- దరఖాస్తుదారుకు మరే ఇతర ప్రభుత్వ పింఛను వస్తూ ఉండకూడదు.
