పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి

పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి
- పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
మక్తల్, ఆంధ్రప్రభ ; మున్సిపల్ ఉప ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశించారు.నారాయణపేట జిల్లా, మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ తెలిపారు. శనివారం రోజున మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ స్వయంగా సందర్శించి, ఎన్నికల సరళి తోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారులతో మాట్లాడిన ఎస్పీ, పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగాలని సూచించారు. గతంలో 6వ వార్డు ఎన్నికల అభ్యర్థి మరణం కారణంగా ఈ వార్డుకు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఓటు వేయడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లా పోలీసు శాఖ హై అలర్ట్‌లో కొనసాగాలని, శాంతి–భద్రతలను కాపాడడంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు కూడా సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి తోడ్పడాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు. మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్ఐ వై.భాగ్యలక్ష్మి రెడ్డి తదితరులు, పోలీసు సిబ్బంది ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
