ఇంటర్ అడ్మిషన్లపై అప్రమత్తంగా ఉండాలి

ఇంటర్ అడ్మిషన్లపై అప్రమత్తంగా ఉండాలి

అనుమతి లేని కళాశాలల్లో చేరొద్దు
అడ్మిషన్ షెడ్యూల్ విడుదల కాలేదు
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లాలో కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు 10వ తరగతి ఫలితాలు రాకముందే ఇంటర్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. ఇప్పటివరకు ఇంటర్ బోర్డు అధికారిక అడ్మిషన్ షెడ్యూల్ విడుదల కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు ద్వారా కళాశాలల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, అనుమతి లేని కళాశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు వచ్చే వారిని నమ్మవద్దని హెచ్చరించారు.

ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలలో మాత్రమే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను చేర్పించాలని సూచించారు. ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసేంత వరకు ఏ కళాశాలలోనూ అడ్మిషన్లు చేపట్టడానికి అనుమతి లేదని ఆయన తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి అడ్మిషన్ల పేరుతో వచ్చే వ్యక్తులను నమ్మి మోసపోకూడదని విజ్ఞప్తి చేశారు. ముందుగా అన్ని కళాశాలలు ఇంటర్ బోర్డు అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇంటర్ బోర్డు అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం మాత్రమే అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రైవేట్ కళాశాలల ప్రలోభాలకు లోనై ఎలాంటి ఫీజులు చెల్లించరాదని, ఎలాంటి హామీలను నమ్మవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. ఇంటర్ బోర్డు అనుమతి పొందిన కళాశాలలలోనే షెడ్యూల్ విడుదలైన తర్వాత చేర్పులు చేపట్టాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు.

Leave a Reply