ఏప్రిల్ 9 నుంచి 23 వరకు పోషణ పక్వాడ….

ఏప్రిల్ 9 నుంచి 23 వరకు పోషణ పక్వాడ….

జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలి: ఐసిడిఎస్ పీడీ పి. విజయ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు నిర్వహించనున్న పోషణ పక్వాడ కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయ బుధవారం సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ మేటర్నిటీ ఆసుపత్రుల్లో కూడా పోషణ పక్వాడ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని మాతృశిశు ఆరోగ్య సేవలను సమగ్రంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు.

రెండు సంవత్సరాల లోపు పిల్లల మెదడు అభివృద్ధి దృష్ట్యా మొబైల్, టీవీ వంటి స్క్రీన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించి, ఇంటి వంట సహజ ఆహారాన్ని ప్రోత్సహించాలన్నారు. అధిక సోడియం, ఎమల్సిఫైయర్లు, స్టెబిలైజర్లు కలిగిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు.
చిప్స్, కుర్కురే వంటి జంక్ ఫుడ్స్‌కు బదులుగా శెనగలు, పప్పులు, పల్లీలు, పాప్‌కార్న్, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను వినియోగించాలని సూచించారు.

కుటుంబంలో పురుషుల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారీ, శిశు ఉపాహార (వీనింగ్ ఫుడ్) తయారీ పోటీలు నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా తక్కువ ఖర్చుతో స్థానికంగా లభించే పదార్థాలతో తండ్రుల కోసం బొమ్మల తయారీ పోటీలు నిర్వహించాలని సూచించారు. పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం బొమ్మలు, కథా పుస్తకాల దానం కార్యక్రమాలను ప్రోత్సహించాలని, సమాజం చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోషణ పక్వాడ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సంబంధిత శాఖలు, ప్రజాప్రతినిధులు, సమాజంలోని అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని ఐసిడిఎస్ పీడీ పి. విజయ కోరారు.

Leave a Reply