మత సామరస్యానికి నిదర్శనం..

మత సామరస్యానికి నిదర్శనం..

విజయవాడలో అంతిమ యాత్ర వాహనం ప్రారంభం
ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటన

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలో మత సామరస్యాన్ని చాటిచెప్పే దిశగా ఎంపీ కేశినేని చిన్ని కీలక ముందడుగు వేశారు. తూర్పు నియోజకవర్గంలోని మరనాత దేవాలయ సేవా సంఘం విజ్ఞప్తి మేరకు, కేశినేని ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో సమకూర్చిన అంతిమ యాత్ర వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ గ్రేటర్ విజయవాడ నగరం కులమతాలకు అతీతమని, మిషనరీ సంస్థలు చేసిన సేవలు సమాజ అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు క్రైస్తవ సోదరుల అవసరాల కోసం సొంత నిధులతో డెత్ వెహికల్‌ను అందించామని తెలిపారు. గతంలో క్రైస్తవ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపిస్తూ, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో చర్చిలు, మైనారిటీ ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ మత సామరస్యానికి నిలయమని, అన్ని వర్గాల ఆశీర్వాదాలతోనే అభివృద్ధి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. నగరాన్ని త్వరలోనే గ్రేటర్ విజయవాడగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఎంపీ నిధుల్లో మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉన్న బరియల్ గ్రౌండ్ అంశాన్ని ఎంపీ సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply