పారిశ్రామిక వేత్తలకు డైనమిక్ వేదిక.. ఫౌండర్స్ రూఫ్..

పారిశ్రామిక వేత్తలకు డైనమిక్ వేదిక.. ఫౌండర్స్ రూఫ్..
ఒకేవైదికపై ఫౌండర్స్, ఇన్వెస్టర్స్, క్రియేటర్స్
ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్తకు సరికొత్త చేయూత
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, సృజనాత్మకత కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ఇటీవల ఏర్పాటైన ఫౌండర్స్ రూఫ్ కార్యకలాపాలు విజయవంతంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి, ఇప్పటికే ప్రారంభించిన పరిశ్రమల విజయవంతానికి మెరుగైన దిశానిర్దేశం పొందేందుకు ఇలా వివిధ అంశాలకు సంబంధించి పరస్పరం ఆలోచనలు పంచుకునేందుకు, సహాయసహకారాలు అందుకునేందుకు విష్ణు, జగదీష్ వ్యక్తులు ఫౌండర్స్ రూఫ్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సంస్థ ప్రతి ఆదివారం ఆఫ్‌లైన్ మీటప్స్‌ను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తోంది. ఈ ఆదివారం బెరం పార్కులో జరిగిన మీటప్‌లో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. వారి వ్యాపార ఆలోచనలను, భవిష్యత్తు కార్యాచరణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి ఆదివారం నిర్వహించే ఫౌండర్స్ రూఫ్ మీటప్స్ ద్వారా ప్రత్యక్షంగా పరిచయాలు పెంపొందించుకోవడం, పటిష్ట సంబంధాలను ఏర్పరచుకోవడం, స్టార్టప్ ఆలోచనలను ప్రదర్శించడం వంటి అవకాశాలు లభిస్తాయని.. విజయవాడలో స్టార్టప్ సంస్కృతిని మరింత బలోపేతం చేయడానికి, పారిశ్రామిక వేత్తలకు సహకార వాతావరణాన్ని కల్పించడానికి ఈ వేదిక కీలకంగా నిలుస్తుందని ప్రశంసించారు.

ఈ వేదిక ద్వారా వ్యాపార సంస్థలు తమ సేవలను ప్రమోట్ చేసుకునేందుకు, సమర్థవంతులైన మానవ వనరులు, ఫ్రీలాన్సర్లను కనుగొనడం ద్వారా తమ వ్యాపారాన్ని మెరుగుపరచుకునేందుకు వీలవుతుందన్నారు. జిల్లాలో ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త సాకారానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. గుంటుపల్లిలోని రైజ్ కేంద్రం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.
ఈ బృహత్తర ప్రయత్నంలో ఫౌండర్స్ రూప్ కూడా భాగస్వామ్యం కావాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొంటూ అందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌టీఆర్ జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

