పేదల ముంగిటకే వైద్య సేవలు…

పేదల ముంగిటకే వైద్య సేవలు…
నరసరావుపేట, ఆంధ్రప్రభ : జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ఇంటి వద్దకే చేరవేసే లక్ష్యంతో ‘మీ ఇంటికి మీ డాక్టర్’ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో మొబైల్ క్లినిక్ యూనిట్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్ర రాష్ట్ర వైద్య శాఖ సహకారంతో, ఆర్.ఈ.సి ప్రాజెక్ట్ సౌజన్యంతో ఈ మొబైల్ క్లినిక్ యూనిట్ వాహనాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు, ముఖ్యంగా ఆసుపత్రులకు వెళ్లలేని వృద్ధులకు, గర్భిణీలకు, చిన్నపిల్లలకు ఈ మొబైల్ క్లినిక్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. శిశు మరణాల రేటు, మాతృ మరణాల రేటు తగ్గించడం, అంటు వ్యాధుల నియంత్రణే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో ఆర్.ఈ.సి ఫౌండేషన్ సుమారు ₹8.40 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోందని, జిల్లాలో ఈ సేవలు నిరంతరం కొనసాగేలా రెడ్ క్రాస్ ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మేదరమెట్ల రామ శేషగిరిరావు నేతృత్వంలో ఈ బృహత్తర సేవా యజ్ఞం అత్యంత సమర్థవంతంగా రూపుదిద్దుకుంది.
జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను ప్రతి గ్రామానికి చేరువ చేయడంలో రామ శేషగిరిరావు చూపుతున్న చొరవను అధికారులు, ప్రజలు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా రామ శేషగిరిరావు మాట్లాడుతూ “వైద్య సదుపాయాలు అందని మారుమూల గ్రామాల ప్రజల కోసం ఈ మొబైల్ యూనిట్ ద్వారా ఒక డాక్టర్, నర్సు, ఫార్మసిస్ట్, డ్రైవర్‌తో కూడిన బృందం నేరుగా రోగుల వద్దకు వెళ్తుందని, ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, అవసరమైన మందులను కూడా అక్కడికక్కడే ఉచితంగా అందజేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు జిల్లా స్థాయి అధికారులు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో ఈ మొబైల్ క్లినిక్ ఒక గొప్ప ముందడుగు అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్ కెఎంఎన్వి శ్రీనివాస గుప్తా, కోశాధికారి డాక్టర్ నంద్యాల రాంప్రసాద్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ చంద్రశేఖర్, కమిటీ సభ్యులు బత్తుల మురళి, విన్సెంట్ పాల్, డాక్టర్ సృజనా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
