అమరజీవి త్యాగం.. స్వాభిమానానికి ప్రతీక..

అమరజీవి త్యాగం.. స్వాభిమానానికి ప్రతీక..
శ్రీ పొట్టి శ్రీరాములు మార్గం.. తరతరాలకు స్ఫూర్తిదాయకం..
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి, భాషా-సాంస్కృతిక స్వాభిమానానికి నిలువెత్తు ప్రతీక అని.. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టరేట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగనిరతిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చాలా గొప్పదని, ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రేమ, నిస్వార్థంతో కూడిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ఇలాంటి గొప్ప వ్యక్తుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు కృషిచేయాలని సూచించారు.
మహనీయుల త్యాగనిరతి, స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. అమరావతిలోని శాఖమూరులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరై వీక్షించారు.
కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.
