రైతు ఆత్మహత్య. అసలు ఏం జరిగింది..?

రైతు ఆత్మహత్య. అసలు ఏం జరిగింది..?
తుగ్గలి, ఆంధ్రప్రభ : అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని రాతన గ్రామానికి చెందిన హరిజన గంగయ్య (39) అనే రైతు తన ప్రాణాలు తీసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల వివరాల ప్రకారం గంగయ్యకు స్వంతంగా ఉన్న పొలంతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. గత కొన్ని సీజన్లుగా వర్షాభావం, ప్రకృతి అనుకూలించకపోవడం వల్ల పంటలు ఆశించినంతగా పండకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
సాగు ఖర్చులు, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువుల కోసం తీసుకున్న అప్పులు క్రమంగా పెరుగుతూ రావడంతో ఆయనపై అప్పుల భారం మరింతగా పెరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పంట దిగుబడి తగ్గిపోవడంతో అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళన గంగయ్యను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసినట్లు సమాచారం. ఆర్థిక సమస్యలతో తీవ్రంగా కలత చెందిన ఆయన చివరకు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కుటుంబానికి ఆర్థికంగా ఆధారం అయిన గంగయ్య మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలచివేసింది. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, పంటల నష్టాలు, అప్పుల భారంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు తగిన సహాయం, పంటలకు సరైన ధర, సాగు రుణాల పై ఉపశమనం కల్పించే చర్యలు అవసరమని వారు కోరుతున్నారు.
