ఎండలో ఉపాధి కూలీల అవస్థలు

ఎండలో ఉపాధి కూలీల అవస్థలు
- కనీస వసతులు లేక పనిస్థలాలు
- అధికారుల నిర్లక్ష్యం
పాలకుర్తి, ఆంధ్రప్రభ : మండలంలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండగా ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రాథమిక సౌకర్యాలు లేక ఎండలోనే కూలీలు చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని ప్రదేశాల్లో కూలీలకు కనీస వసతులు కల్పించాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మండలంలో సుమారు 15 వేల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతుండగా, వారికి సరైన సౌకర్యాలు లేక అవస్థలు తప్పడం లేదు.
ఎండదెబ్బతో ప్రాణాలకు ముప్పు
మండలంలోని పలు గ్రామాల్లో ప్రతి ఏడాది పని ప్రదేశాల్లో వడదెబ్బతో కూలీలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య ఒక్కసారిగా పెరగనుంది. అయినప్పటికీ ఎండల నుంచి రక్షణ కల్పించే చర్యలు మాత్రం కనిపించడం లేదు. గతంలో కూలీలు భోజనం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రభుత్వం గుడారాలు (టెంట్లు) పంపిణీ చేసేది. అయితే గత ఏడేళ్లుగా వాటి పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. ఈ సారైనా వాటిని అందిస్తే ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని కూలీలు అంటున్నారు.
నీళ్లు కూడా ఇంటి నుంచే…
పని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం లేక కూలీలు ఇళ్ల నుంచే నీటి డబ్బాలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు దాహంతో తల్లడిల్లుతున్నా పట్టించుకునే వారు లేరని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పదేళ్లుగా పనిముట్లు అందించకపోవడంతో కూలీలు తమ ఖర్చుతోనే పనిముట్లు తెచ్చుకుని పని చేస్తున్నారు.
ప్రాథమిక చికిత్స కూడా లేదు
పని సమయంలో గాయాలు జరిగితే వెంటనే చికిత్స అందించేందుకు ప్రాథమిక చికిత్స కిట్లు ఉండాలి. అందులో అయోడిన్, బ్యాండేజీలు అవసరమైన మాత్రలు ఉండాల్సి ఉంది. కానీ గత ఎనిమిదేళ్లుగా ఈ కిట్లు కూడా అందుబాటులో లేవని కూలీలు చెబుతున్నారు. ఎండలు పెరుగుతున్నా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
