వర్ని మండలంలో పిచ్చికుక్క దాడి

వర్ని మండలంలో పిచ్చికుక్క దాడి
- పదిమందికి గాయాలు
వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండల కేంద్రంలో శుక్రవారం పిచ్చికుక్క పలువురిపై దాడి చేసి భయాందోళనలు సృష్టించింది. ఈ ఘటనలో మొత్తం పదిమందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వడ్డేపల్లి ప్రాంతంలో ఇద్దరిపై, కొత్త కాలనీలో ఇద్దరిపై, దేవి రోడ్డులో ముగ్గురిపై అలాగే ప్రధాన రహదారిపై వెళ్తున్న వారిపై కూడా కుక్క దాడి చేసింది. తెల్లవారుజామున ఇంటి వద్ద పనులు చేస్తున్న సమయంలో ఈ దాడులు జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
గాయపడిన వారిలో కొందరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందగా, మరికొందరు బోధన్ పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మరియు నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనతో ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి పిచ్చికుక్కను పట్టుకుని ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
