భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయాలి..

భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయాలి..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న దుర్గగుడి అభివృద్ధి పై సమీక్ష జరిగింది. మహా మంటపంలోని 4 వ అంతస్తులో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్ లాల్, ఆలయ ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ ను వివరించారు. అందులో భాగంగా రెండో ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్లు, మల్టీ లెవల్ పార్కింగ్, తదితర ప్రతిపాదనలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మొత్తం దాదాపు 320 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలపై చర్చించారు. భక్తులకు శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించినట్లు సుజనా చౌదరి తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సుజనా చౌదరి దుర్గ గుడి చైర్మన్ కు వివరించారు. అదే విధంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం పునరావృతం కాకుండా దుర్గ గుడి స్వయంగా ఆవు పాలు, నెయ్యి సమకూర్చుకునేలా ఒక ప్రణాళికను సుజనా చౌదరి సూచించారు.
కొందరు మహిళలకు గోవులను సమకూర్చి వాటి పోషణ, పాల ఉత్పత్తులు ఆలయానికి వినియోగించేలా కార్యాచరణ వివరించారు. అవసరమైతే విజయా డైరీ సహకారం తీసుకుని పాలు, నెయ్యి సొంత ఆవుల నుంచి సమకూర్చుకునేలా చూడాలని అధికారును కోరారు. వీటి తోపాటు కుమ్మరి పాలెంలోని టీటీడీ స్థలంలో కానీ వేరే ప్రాంతంలో కానీ వసతి గృహాలు, ఏర్పాటును కూడా పరిశీలించాలని కోరారు. ఆదాయం పెంచి, ఖర్చులు తగ్గించేలా సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. భక్తులకు శీఘ్ర దర్శనం తో బాటు క్రౌడ్ మేనేజ్ మెంట్ కు అనువుగా సౌకర్యాలను మెరుగుపర్చాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు. పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం తరపున వాటిని ఆమోదింపచేసేందుకు కృషి చేస్తాం అని మంత్రి తెలిపారు.
