మార్చి 3న దుర్గగుడి మూసివేత….

మార్చి 3న దుర్గగుడి మూసివేత….
చంద్రగ్రహణం కారణంగా ఇంద్రకీలాద్రిపై తాత్కాలిక బ్రేక్.
ఈ నెల 3 ఉదయం 10 గంటల వరకే అమ్మ దర్శనం..
భక్తులకు మార్చి 4 ఉదయం నుంచే దర్శనం
ఆర్జిత సేవల్లో మార్పులు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఏర్పడుతున్న కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ నిర్వహణలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 3 (మంగళవారం) మధ్యాహ్నం సంభవించే చంద్రగ్రహణం కారణంగా అదే రోజు ఉదయం 10 గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయం సహా ఉపాలయాల కవాటాలు మూసివేయబడతాయి. అలాగే ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణను పూర్తిగా రద్దు చేశారు.

ఉదయం నిర్వహించే శాంతి కళ్యాణం, చండీ హోమం, సాయంత్రం జరిగే పంచహారతులు, పల్లకీ సేవ వంటి ఆర్జిత సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గ్రహణ స్పర్శ కాలం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణ వ్యవధి 3 గంటల 28 నిమిషాలుగా ఉంటుంది. గ్రహణం ముగిసిన అనంతరం మార్చి 4 (బుధవారం) తెల్లవారుఝామున 3 గంటలకు ఆలయ కవాటాలు తిరిగి తెరుస్తారు. అనంతరం దేవతామూర్తులకు సుప్రభాతం, స్నపనాభిషేకాలు నిర్వహించి, అర్చనలు, మహానివేదన, హారతులు చేపడతారు. భక్తులకు సాధారణ దర్శనం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అదే రోజు తెల్లవారుఝామున జరిగే సుప్రభాతం, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమం వంటి ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమయ్యే సేవలను 8:30 గంటల నుంచి నిర్వహించనున్నారు. భక్తులు ఈ మార్పులను గమనించి దేవస్థానానికి సహకరించాలని అధికారులు కోరారు.
