గంజాయి, డ్రగ్స్ అడ్డాగా ఏపీ

గంజాయి, డ్రగ్స్ అడ్డాగా ఏపీ

  • రెండేళ్లలో లక్షల కేసులు నమోదు..
  • ప్రభుత్వ, పోలీసుల వైఫల్యం
  • ప్రమాదంలోకి యువత భవిష్యత్తు
  • వైసీపీ సీనియర్ నేత పోతిన వెంకట మహేష్

భవానిపురం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల విస్తరణ తారాస్థాయిలో పెరిగింది అంటూ వైసిపి నేత పోతిన వెంకట మహేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్రమంగా గంజాయి, డ్రగ్స్‌కు కేరాఫ్‌గా మారిపోతుందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే త్వరలోనే రాష్ట్రం పూర్తిగా మాదక ద్రవ్యాల కేంద్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత రెండేళ్లలో సుమారు 2.5 లక్షల గంజాయి కేసులు, 2500కు పైగా డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

కేవలం గత ఆరు నెలల్లోనే ఈగల్ టీమ్ 44 వేలకుపైగా కేసులు నమోదు చేయడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి, డ్రగ్స్ విక్రయాలు విచ్ఛలవిడిగా పెరిగాయని విమర్శించారు. రాష్ట్రంలోకి ఈ మత్తుపదార్థాలు ఎవరి ప్రోత్సాహంతో వస్తున్నాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సరఫరా గొలుసును అడ్డుకోవడంలో ప్రభుత్వం, పోలీసు విభాగం పూర్తిగా విఫలమైందన్నారు.

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుండడం, ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా రాజధాని పరిసరాల్లో కూడా సాగు విస్తరించడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. విజయవాడలో ఒక హాస్టల్ వెనుక గంజాయి మొక్కలు పెంచుతున్న ఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి దారుణతకు నిదర్శనమన్నారు. రాజధాని నగరం గంజాయి, మాదక ద్రవ్యాల అడ్డాగా మారిపోయిందా అని ప్రశ్నించిన ఆయన, గంజాయి సిగరెట్లు విచ్ఛలవిడిగా అమ్ముతున్నారని ఆరోపించారు.

డాబాలపై కూడా గంజాయి సాగు జరుగుతుందనే సమాచారం రావడం గంభీరంగా తీసుకోవాలన్నారు. పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, కేవలం సైకిల్ ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలతో సమస్యలు పరిష్కారం కావని విమర్శించారు. ట్రాఫిక్ చలానాలపై చూపుతున్న శ్రద్ధను డ్రగ్స్ నియంత్రణపై ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. చిన్న పిల్లలు గంజాయి సిగరెట్లు వినియోగిస్తున్న వీడియోలు ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఈ మత్తుపదార్థాల వల్ల నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత అసెంబ్లీలో రాష్ట్రంలో గంజాయి కేసులే లేవని చెప్పడాన్ని తప్పుబట్టిన ఆయన, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతున్నప్పుడు అది ఎలాంటి మార్గాల్లో రాష్ట్రంలోకి వస్తోందో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. ఇక వైసిపి నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ, గంజాయి, డ్రగ్స్ సరఫరాదారులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

యువత జీవితం ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై చేసిన ప్రకటనలు మాటల్లో కాకుండా క్షేత్రస్థాయిలో అమలు కావాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో వైసిపి తరపున కార్యాచరణ రూపొందించి, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోరాటం చేపడతామని పోతిన వెంకట మహేష్ ప్రకటించారు.

Leave a Reply