సమాచార హక్కు చట్టం దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

సమాచార హక్కు చట్టం దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

  • రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ హెచ్చరిక

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తూనికలు–కొలతల శాఖ కార్యాలయాల్లో ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉండే విధంగా అవసరమైన సమాచారాన్ని తప్పనిసరిగా ఉంచాలని ఆయన ఆదేశించారు.

శుక్రవారం సంగారెడ్డిలో తూనికలు–కొలతల శాఖకు సంబంధించిన ఫిర్యాదులపై కేసుల విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం–2005కు అనుగుణంగా పౌరసేవ పత్రమును తెలంగాణ రాష్ట్రంలోని 52 తూనికలు–కొలతల శాఖ కార్యాలయాల్లో ఫిర్యాదుదారులకు స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే శాఖకు సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని తెలిపారు. పక్షం రోజుల్లో ఈ ఏర్పాట్లు చేయని పక్షంలో రూ.25 వేల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.

సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తులకు 30 రోజుల లోపు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. అలాగే 30 రోజులు గడిచినా స్పందన లేకపోతే సంబంధిత శాఖ అధికారులపై సమాచార హక్కు చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు. అదేవిధంగా తూనికలు–కొలతల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం (మార్చి 15), జాతీయ వినియోగదారుల దినోత్సవం (డిసెంబర్ 24)ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజల మధ్య నిర్వహించాలని ఆదేశించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ సూచించారు.

Leave a Reply