అతిసారంపై యుద్ధం.. అవాస్తవాలు నమ్మవద్దు..

అతిసారంపై యుద్ధం.. అవాస్తవాలు నమ్మవద్దు..

అధికారికంగా ఒకరి మృతి.. రంగంలోకి 50కి పైగా వైద్య బృందాలు
ఇంటింటికీ సచివాలయ సిబ్బంది సర్వే
తప్పుదోవ పట్టించే ప్రచారాలు వద్దు
సాయంత్రానికి రానున్న నీటి నమూనాల నివేదిక
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలిన అతిసారంపై సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల్లో వస్తున్న అవాస్తవాలను నమ్మవద్దని, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.. అతిసారం కారణంగా అధికారికంగా ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే మృతి చెందినట్లు ధృవీకరించారు. మిగిలిన మరణాలకు గల ఇతర కారణాలను విశ్లేషిస్తున్నామని, పరిస్థితిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తోందని తెలిపారు.

నగరంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయన్న సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్, డీఎంహెచ్‌ఓలతో కలిసి స్వయంగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు 50కి పైగా వైద్య బృందాలు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

వ్యాధి మూలాలను గుర్తించేందుకు సచివాలయ సిబ్బంది, ఆశా, ఏఎన్ఎంలతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను నమోదు చేస్తున్నామన్నారు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆయన వివరించారు. కలుషిత నీటిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సేకరించిన నీటి నమూనాల తుది నివేదికలు ఈరోజు సాయంత్రానికి వస్తాయని, ఆ తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, కేవలం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగుతూ అధికారులకు సహకరించాలని కోరారు. ఇప్పటివరకు 15 మంది ఆయా ఆసుపత్రి నుంచి ఇళ్లకు డిస్చార్ అయ్యారని, పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు.

Leave a Reply