AP DY.CM fIRE : నెయ్యిలో నెయ్యే లేదు Andhra prabha news

AP DY.CM fIRE : నెయ్యిలో నెయ్యే లేదు Andhra prabha news
- 11 కోట్ల మందికి కల్తీ నెయ్యి లడ్డూలు పంపిణీ
- ఇది ప్రణాళికబద్ధంగా కుట్ర
శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు
నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది
ఎన్.డి.డి.బి. రిపోర్టులో చెప్పింది
\పాల ప్రమేయం లేకుండా
నెయ్యి తయారు చేశారు
అరాచకాల్లోనూ ఇది నూతన ఆవిష్కరణ
ఈ ఘనత గత పాలకులది
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడం
అత్యంత తీవ్రమైన నేరం
మహా అపచారానికి శిక్ష పడి తీరాలి
శాసనసభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి)

AP DY.CM fIRE ‘భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం అత్యంత తీవ్రమైన నేరం. ఈ నేరానికి పాల్పడిన బాధ్యులకు శిక్ష పడాలి. ఈ కేసులో దోషులను కూటమి ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరిగిందన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెబితే, సీబీఐ నేతృత్వంలోని సిట్ చేపట్టిన విచారణలో నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేల్చినట్టు చెప్పారు. పామాయిల్, ఇతర రసాయనాలు కలిపి తయారు చేసినట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయి… ఇది శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడమేనన్నారు. అరాచకాల్లోనూ నూతన ఆవిష్కరణలు చేసిన ఘనత గత పాలకులకే దక్కుతుందనీ, పాల నుంచి కాకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేయొచ్చని వారు చేసి చూపారని చెప్పారు. జరిగిన తప్పుకు గత టీటీడీ పాలక మండలిదే బాధ్యతనీ, అలాంటి వారిని వెనకేసుకొస్తున్న గత ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తి కూడా బాధ్యత వహించాలన్నారు. హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు భాష, కులాలు, ప్రాంతాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించకపోతే ఇలాంటి పరంపరలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. మంగళవారం శాసన సభలో తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై జరిగిన చర్చలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీకి 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వాడారని సిట్ విచారణలో తేలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఎన్డీఏ శాసన సభ్యుల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గత ప్రభుత్వ అరాచకాలను వివరిస్తున్న క్రమంలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక కూడా చదివాను. అప్పటికే పలు సందర్భాల్లో భక్తులు లడ్డూలో నాణ్యత లేదని చెప్పారు. సున్నితమైన వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు చేయకూడదని అనుకున్నాం. వారి పాలనలో దేవాలయాలపై దాడులు జరిగినా దోషుల్ని పట్టుకోవాలని చెప్పాం. అయితే గత పాలకులు అస్సలు నెయ్యిలో కల్తీయే జరగలేదని చెబుతుంటే ఆ వ్యవహారంపై వివరణ ఇవ్వాలనిపించింది. గతంలో తిరుమల వెళ్లిన సందర్భంలోనూ చాలా మంది ప్రసాదం నాణ్యత అంశాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. తప్పు జరిగిందని తెలిసి దాన్ని సరిగా ముందుకు తీసుకువెళ్లకపోతే ఎలా అన్న పశ్చాత్తాపంతో దీక్ష చేశాను. ఎన్.డి.డి.బి. నివేదిక నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయని చెబితే అదే అంశాన్ని ట్వీట్ చేశాను. అప్పుడే దేవాలయాల పరిరక్షణకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపించింది. మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఆ నెయ్యిలో అస్సలు నెయ్యే లేదని చెప్పారు.
AP DY.CM fIRE గత పాలక మండలే జవాబుదారీ

సభ సాక్షిగా చెబుతున్నా ఈ వ్యవహారంలో గత ప్రభుత్వం తాలూకు వ్యక్తులు చేశారని ఎక్కడా చెప్పలేదు. ఈ తప్పుకి గత టీటీడీ పాలక మండలిదే బాధ్యత. గత ప్రభుత్వం నియమించిన పాలక మండలి చేసిన తప్పుకి వారే జవాబుదారీ అని చెప్పాను. ఈ వ్యవహారంపై ఎవరైనా నిస్పక్షపాతంగా కమిటీ వేసి బాధ్యులను శిక్షించాలని చెప్పాలి. కానీ వారు ఎందుకు వెనకేసుకొస్తున్నారో అర్థం కావడం లేదు. తిరుపతి లడ్డూ గురించి ఇంత సభా సమయాన్ని ఎందుకు వృథా చేయాలి. కల్తీ జరిగింది. చర్యలు తీసుకోండి అంటే తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. అస్సలు కల్తీయే జరగలేదు. జంతువుల కొవ్వు లేదు అని మాట్లాడడమే ఇంత చర్చకు దారితీసింది.
AP DY.CM fIRE నచ్చిన సంస్థలకు కాంట్రాక్టులు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న కేసు దర్యాప్తు చేసిన సీబీఐ నేతృత్వంలోని సిట్ ఆ నెయ్యి తయారీకి ఒక్క లీటరు పాలు కూడా వినియోగించలేదని తేల్చింది. పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు చెప్పింది. ఆ ఇతర రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారయ్యాయో నిర్థారించే సాంకేతికత తమా వద్ద లేదని ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తేల్చింది. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్రణాళికాబద్దంగా కుట్ర జరిగినట్టు సిట్ చెప్పింది. తమకి నచ్చిన సంస్థలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఓ ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలు సవరించారు. నెయ్యి సరఫరా సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్ రూ.250 కోట్ల నుంచి రూ. 150 కోట్లకి తగ్గించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలను సేకరించాలన్న నిబంధనను తొలగించారు. డెయిరీ రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాదికి కుదించారు. రోజుకి 12 టన్నుల వెన్న తయారు చేయాలన్న నిబంధనను 8 టన్నులుగా మార్చేశారు.
AP DY.CM fIRE 11 కోట్ల మందికి కల్తీ నెయ్యి లడ్డూలు పంపిణీ

సవరణ అనంతరం వాళ్ళు ఎంపిక చేసిన సంస్థలు 2020-2023 మధ్య నెయ్యి సరఫరా చేశాయి. నెయ్యి సరఫరా చేసిన సంస్థకి అందుకు కావాల్సిన కనీస అర్హతలు లేవని సిట్ ఛార్జ్ షీట్ చెప్పింది. వీరు నెయ్యి సరఫరాకి ఎంచుకున్న భోలే బాబా అనుబంధ సంస్థలు మాల్ గంగా, వైష్ణవి డెయిరీలు ఒక్క లీటరు నెయ్యిని కూడా పాల నుంచి తయారు చేయలేదు. 2019-2024 మధ్య కాలంలో సుమారు 11 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే, ఆ కాలంలో మొత్తం 48.76 కోట్ల లడ్డూ ప్రసాదాల విక్రయం జరిగింది. అందులో సుమారు 20.10 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని టీటీడీ రికార్డులు చెబుతున్నాయి. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన ప్రసాదాన్ని విక్రయించారు. ఇందులో నుంచే లక్ష లడ్డూలు ఆయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పంపిణీ చేశారు. మళ్లీ ఆ లడ్డూలు కల్తీ నెయ్యితో చేసినవి కాదు అంటారు. సిట్ రిపోర్టు నెయ్యిలో రసాయనాలు ఉన్నాయని చెప్పింది. ఆ రసాయనాల్లో ఏముందో పెరుమాళ్లకెరుక. హిందూ ధర్మానికి కాకుండా ఇంకా ఏ ధర్మానికి ఇలాంటిది జరిగినా దేశం మొత్తం గగ్గోలు పెట్టేసేవారు. మన దేశంలో ప్రతి హిందువు దర్గాకి వెళ్తారు. సకల ధర్మాలను గౌరవించడం మన దేశం తాలూకు మూల సంస్కృతి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామికి పెట్టిన ప్రసాదాన్ని అపవిత్రం చేసి తప్పు లేదని మాట్లాడుతున్నారు. ఇలాగే ఇస్లాం, క్రిస్టియానిటీల్లో జరిగితే పరిస్థితులు ఇలా ఉండేవి కావు. ఇతర మతాల గురించి మాట్లాడితే ఓట్లు పోతాయి. హిందువుల గురించి మాట్లాడడం తేలిక అన్న పద్దతిలో మార్పు రావాలి.

AP DY.CM fIRE వసూళ్లు రాజాలు భగవంతుడి సేవలో తగరు
కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నప్పుడు తప్పు చేశామన్న అపరాధ భావన వాళ్ళకు కలిగి తీరుతుంది. ఇన్ని తప్పులు చేసిన వారిని వెనకేసుకుని వచ్చే వారికి ఆ పాపం చుట్టుకుని తీరుతుంది. శ్రీకృష్ణ దేవరాయలు వారు రచించిన అముక్తమాల్యదలోని 218వ పద్యంలో రాజుకి కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ ఓ పద్యం ఉంది. భగవంతుడి సేవలో ఎలాంటి వారిని నియమించాలో రాజుకి కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం అది. ఆయతికానికి ఇవ్వకు మమరాలయ ముఖ్యం అతడు అర్థ తృష్ణాయుతుడై నిజోర్వి అగు నష్టికి ఆ ధనమును తరల్చి, రాజు ఆయతనమునకు చేర్చు, మరి అట్టిది అపథ్యము, కాన, వొంటిగాడే అధికారి కావలయు, ఇంచుక తిన్నను వాడె రూపరున్ రాజు కోసం వసూళ్లు చేసే వారికి దేవాలయాలపై అధికారం ఇవ్వొద్దు. అలాంటి వారు డబ్బు మీద ఆశతో రాజ్యానికి సంబంధించిన వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా దేవుడి ధనాన్ని రాజు ఖజానాకి చేర్చేస్తాడు. అది తప్పుడు పని కాబట్టి ఎలాంటి మమకారాలు లేని ఒంటరివాడే ఆలయానికి అధికారిగా ఉండాలి. ఒకవేళ వారు దేవుడు సొత్తు తిన్నప్పటికి ఆ పాపానికి వాడే నాశనం అవుతాడు. ఆ డబ్బు తెచ్చి రాజుకి చేర్చడం వల్ల రాజ్యమే నాశనం అవుతుందని ఆ పద్యం చెబుతుంది. గత ప్రభుత్వ పాలనలో అంతా ఇలాగే జరిగింది. తిరుమలలో వారి కర్మలను భక్తులు డబ్బు రూపంలో వేస్తారు. అలాంటి భగవంతుడి డబ్బుని దోచుకునే వారి తరాలే లేచిపోతాయి. వాళ్ళు ఈ కేసుని సాగదీసే కొద్దీ వాళ్ళ పాపం పెరుగుతుంది”
