Sad Sunday | ఇబ్రహీంపట్నంలో విషాదం Andhra Prabha Crime News

Sad Sunday | ఇబ్రహీంపట్నంలో విషాదం Andhra Prabha Crime News
Sad Sunday | ఇబ్రహీంపట్నంలో విషాదం Andhra Prabha Crime News
NTTPS మాజీ ఉద్యోగి దుర్మరణం
కొండపల్లి డీఏవీ స్కూల్ ఎదుట వరుస ప్రమాదాలు
ఈ నెలలో రెండో దుర్ఘటన
ప్రాణాలు తీస్తున్న బారికేడ్లు..
పునరాలోచనకు వాహనదారుల విజ్ఞప్తి
బారికేడ్ ను ఢీకొని విశ్రాంత ఉద్యోగి దుర్మరణం
( ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ):
Sad Sunday | ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం – ఛత్తీస్ గఢ్ జాతీయ రహదారిపై కొండపల్లి డీఏవీ స్కూల్ ఎదుట ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విశ్రాంత ఉద్యోగి దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం కొండపల్లి వడ్డే నగర్ కు చెందిన వీధి ఏసుబాబు (62) ఎన్టీటీపీఎస్ లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఇతను ఇబ్రహీంపట్నం వైపు నుంచి ద్విచక్ర వాహనంపై కొండపల్లి వస్తూ డీఏవీ స్కూల్ ఎదుట రోడ్డుపై బారికేడ్ ను బలంగా ఢీకొట్టడంతో అతనిపై పడిపోయింది. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్క నిమిషంలో ఇంటికి చేరాల్సిన ఏసుబాబును బారికేడ్ రూపంలో మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Sad Sunday | ఈ నెలలో రెండో ప్రమాదం

ఈ నెల 6న డీఏవీ స్కూల్ ఎదురుగా ఉన్న జడ్పీ బాలికల హైస్కూల్ వైపు ఓ బాలుడు మృతి చెందాడు. అదే రోజు మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం విచ్చేశారు. జగన్ ను చూసేందుకు వెళ్లాలన్న ఆత్రుతతో బైక్ పై కొండపల్లి బీ కాలనీ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్న శ్రామికనగర్ (కొత్తగేటు)కు చెందిన భార్గవ్ (17) ఇదే విధంగా రోడ్డుపై బారీకేడ్ ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Sad Sunday | ప్రాణాలు తీస్తున్న బారికేడ్లు

వేగ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ఇబ్రహీంపట్నం పోలీసులు రెండు జాతీయ రహదారులపై కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనచోదకులు జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ బారికేడ్ల వద్ద వేగ నియంత్రణ చేయలేక వాటిని ఢీకొంటున్నారు. నాలుగు చక్రాల వాహనాలు బారికేడ్లను ఢీకొని వెళ్లిపోతున్నాయి. ద్విచక్ర వాహన చోదకులకు ఈ బారికేడ్లు ప్రాణసంకటంగా మారాయి. వీటిని ఢీకొంటున్న చోదకులకు బలమైన గాయాలై మృతి చెందుతున్నారు. డీఏవీ స్కూల్ వద్ద ఈ నెలలో జరిగిన రెండు ప్రమాదాల్లోనూ బారికేడ్ల వల్ల బలమైన గాయాలై ఇద్దరు మృతి చెందారు. ఈ ఏడాది జనవరి 2వ తేదీన గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ ఎదుట వేగంగా వెళ్తున్న లారీ బారికేడ్లను దాటే క్రమంలో వేగాన్ని అదుపుతప్పి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం మధిర పట్టణానికి చెందిన వెల్లంకి బాబూరావు (55) లారీ కింద ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు. ఇతని భార్య మరియం (55) తీవ్ర గాయాలతో బయటపడింది. ప్రమాదాలను నివారించాలని పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తే వాహన చోదకుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయి. ఈ బారికేడ్ల ఏర్పాటుపై పోలీసు ఉన్నతాధికారులు పునరాలోచించి చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు.
