Oxford | అభి చంద్ర కార్తీక్ అరుదైన ఘనత

Oxford | అభి చంద్ర కార్తీక్ అరుదైన ఘనత
Oxford | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లా యువత మేధస్సు ప్రపంచ స్థాయిలో మరోసారి మెరిసింది. ప్రతిష్ఠాత్మకమైన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఒకేసారి ప్రవేశం సాధించి, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డిసిహెచ్ఎస్) నూర్తి కళ్యాణ్ బాబు కుమారుడు అభి చంద్ర కార్తీక్ నూర్తి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ఎంఫిల్ డెవలప్మెంట్ స్టడీస్ (ఎకనామిక్స్) చదివేందుకు ఆయనకు అవకాశం లభించింది. మన జిల్లా నుంచి కింగ్స్ కాలేజ్ లండన్, ఎల్ఎస్ఈ, ఆక్స్ఫర్డ్ వంటి మూడు అత్యున్నత విశ్వవిద్యాలయాలకు ఎంపికైన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు.
స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన అభి, చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండేవారు. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ స్కాలర్‌గా తన మేధస్సును నిరూపించుకున్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో ఫిలాసఫీ, పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో ఫస్ట్ క్లాస్‌లో పట్టా పొందారు. అనంతర కాలంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, కింగ్స్ కాలేజ్ లండన్ సంయుక్తంగా నిర్వహించిన ఎంగెల్స్బర్గ్ అప్లైడ్ హిస్టరీ ఫెలోషిప్ కు కూడా ఆయన ఎంపికయ్యారు.
విద్యతో పాటు సామాజిక అంశాల్లో తనదైన ముద్ర వేసిన అభి చంద్ర కార్తీక్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు వద్ద పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ ఇంటర్న్‌గా కూడా పనిచేశారు. జిల్లాకు చెందిన యువకుడు సాధించిన ఈ అంతర్జాతీయ విజయంపై జిల్లావ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
