150 Hotspot | డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే కాల్ 1972..

150 Hotspot | డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే కాల్ 1972..
- 29 అంశాలతో డ్రగ్స్‌పై దండయాత్ర..
- విజయవంతంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు..
- డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషిచేద్దాం..
- బాధితులకు పునరావాసం, నైపుణ్య శిక్షణపైనా ప్రత్యేక దృష్టి..
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు
150 Hotspot | విజయవాడ, ఆంధ్రప్రభ : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషిచేద్దామని, ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే 1972 ద్వారా సమాచారమివ్వాలని, ఈ నంబరుపై విస్తృత అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం, నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సెలింగ్ సేవలు తదితరాలపై మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సమావేశం జరిగింది.
పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, డీఎల్ఎస్ఏ సెక్రటరీ కె.రామకృష్ణయ్య తదితరులు హాజరైన సమావేశంలో జిల్లాలో నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డీ అడిక్షన్ కేంద్రం సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్‌స్పాట్స్ తనిఖీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ఈగల్ ఆధ్వర్యంలో 133 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.

కళాశాలలు, ఉన్నతపాఠశాలలు, వివిధ ప్రాంతాల్లో వీటిని నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో గుర్తించిన 150 హాట్‌స్పాట్ ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. గతేడాది ఈగల్ ఆధ్వర్యంలో 27 కేసులకు సంబంధించి 71 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.
మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారికి డీ అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్‌తో పాటు డిటాక్షిఫికేషన్ చేసిన అనంతరం సరికొత్త జీవితాన్ని ప్రారంభించేలా నైపుణ్య శిక్షణ వంటివాటిపై దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లోనూ ఈగల్ క్లబ్స్ క్రియాశీలంగా పనిచేసేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
150 Hotspot | అందుబాటులో ప్రత్యేక వెబ్‌సైట్..
జిల్లాలో డ్రగ్స్‌పై దండయాత్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని.. 34 డే యాంటీ డ్రగ్స్ సైకిల్ ర్యాలీలు కూడా జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. వెబ్‌సైటు కూడా అందుబాటులో ఉందని, ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకొని, ప్లెడ్జ్ తీసుకోవాలని సూచించారు. పిట్ ఎన్‌డీపీఎస్ చట్టాన్ని పటిష్టంగా అమలుచేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు.
కార్యక్రమంలో సే నో టు డ్రగ్స్, డ్రగ్స్ వద్దు .. స్కిల్స్ ముద్దు, ఈగల్ టోల్‌ఫ్రీ నంబరు 1972, ఈగల్ క్లబ్స్ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, బి.లక్ష్మీనారాయణ, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, టీజీ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి వాడ్రేవు కామరాజు, ఈగల్ అధికారులు ఎం.రవీంద్ర, డి.నాగార్జున, ఎం.వీరాంజనేయులు, సమన్వయ శాఖల అధికారులతో పాటు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, నవజీవన్ బాల్ భవన్, ఆకర్ష ఫౌండేషన్, హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు హాజరయ్యారు.
