Polide raids : ధాబాల్లో దడదడ Andhra Prabha News

Polide raids : ధాబాల్లో దడదడ Andhra Prabha News
చిత్తూరు జిల్లా పోలీసులు మెరుపు దాడులు
పేకాట గప్ చిప్
మందుబాబులు మాయం
చిత్తూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో:
జిల్లా వ్యాప్తంగా రహదారుల పక్కన ఉన్న ధాబాలు, హోటళ్లు , భోజనశాలలపై చిత్తూరు జిల్లా పోలీసులు గురువారం రాత్రి విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ప్రధాన జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ధాబాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
Polide raids

చిత్తూరు జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలను (Polide raids ) నిర్వహించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎక్కువగా రద్దీగా ఉండే రోడ్డు పక్కన ఉన్న ధాబాలు, చిన్న హోటళ్లు, భోజనశాలలను ప్రత్యేకంగా తనిఖీ చేసి భద్రతా ప్రమాణాల అమలుపై దృష్టి సారించారు. డాబాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వారి గుర్తింపు పత్రాలు, పార్కింగ్ సదుపాయాలు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, లైటింగ్ సౌకర్యాలు, పరిసరాల భద్రత వంటి అంశాలను పోలీసులు సమగ్రంగా పరిశీలించారు.
Polide raids

ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం డాబాల వద్ద అక్రమ కార్యకలాపాలకు అవకాశం లేకుండా చేయడం, మత్తు పదార్థాల వినియోగం లేదా అక్రమ రవాణాను అడ్డుకోవడం, రాత్రి వేళల్లో జరిగే అనుచిత కార్యకలాపాలను నియంత్రించడం, ప్రయాణికులు, మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడమేనని పోలీసులు తెలిపారు. అలాగే రహదారి ప్రమాదాలను నివారించే దిశగా డాబాల వద్ద వాహనాల పార్కింగ్ సరైన విధంగా ఉండేలా సూచనలు చేశారు.
Polide raids

తనిఖీల సందర్భంగా కొన్ని డాబాల్లో భద్రతా ఏర్పాట్లు తగినంతగా లేని విషయాన్ని గుర్తించిన పోలీసులు యజమానులకు తక్షణ సూచనలు జారీ చేశారు. ప్రతి ధాబాలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి నిరంతరం పనిచేసే స్థితిలో ఉండేలా చూడాలని ఆదేశించారు. అక్కడ పనిచేసే ప్రతి ఉద్యోగి పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలని, గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉంచాలని స్పష్టం చేశారు.
Polide raids

అదేవిధంగా ధాబాల వద్ద మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని యజమానులకు కఠినంగా హెచ్చరించారు. రాత్రి వేళల్లో అనవసరంగా గుంపులు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Polide raids

నిబంధనలు ఉల్లంఘించే ధాబాల యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు హెచ్చరిస్తూ, ప్రజల భద్రత కోసం చేపడుతున్న ఈ తనిఖీలకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, రహదారుల భద్రత , ప్రజా శాంతి భద్రత పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని పోలీసులు స్పష్టం చేశారు.
