Diagnostic | మెడికల్ మాఫియాను అరికట్టాలి…

Diagnostic | మెడికల్ మాఫియాను అరికట్టాలి…
Diagnostic | కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పెట్రేగిపోతున్న మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ మునెప్ప, ఎన్ లెనిన్ బాబు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాథంలో డిమాండ్ చేశారు. ఈ రోజు స్థానిక సిఆర్ భవన్ లో ఈ నెల 14వ తేది న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా జరిగే ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మునెప్ప, లెనిన్ బాబు, జగన్నాథంలు మాట్లాడుతూ… చిన్న క్లినిక్ లో నుంచి కార్పొరేట్ హాస్పిటల్ వరకు, గల్లీ మందుల దుకాణాల నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ ల వరకు కమిషన్ల దందా పేదల ప్రజల నడ్డి విడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నామమాత్రపు ఆరోగ్యశ్రీ సేవల వలన రోగులు ప్రవేట్ ఆసుపత్రి ను ఆశ్రయించాల్సి వస్తుందని దీనిని అదునుగా చేసుకొని మెడికల్ మాఫియా చలరేగిపోతుందని విమర్శించారు. వీటిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న పీపీపీ విధానం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందరి ద్రాక్షగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవేట్ శక్తుల చేతుల్లోకి వైద్యరంగం వెళ్లకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా రాష్ట్రంలో కల్తీ మందుల వల్ల అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు చేయడం వల్ల ప్రజల ప్రాణాలకు హాని కలగడంతో పాటు వేలకు వేల ఖర్చు చేయాల్సి వస్తుందని వారు మండిపడ్డారు. మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మెడికల్ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ మాఫియా ఆగడాలు అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈనెల 14వ తేదీన కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, నగర సహాయ కార్యదర్శిలు సి మహేష్, డి శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీసన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షాబీర్ భాష, నగర అధ్యక్ష కార్యదర్శులు అభి, అశోక్, ప్రజాసంఘాల నాయకులు శ్రీకాంత్, అఖిల్ రాముడు, తదితరులు పాల్గొన్నారు.
