800yearold | నాటి కాకతీయుల ఇంజనీరింగ్ అద్భుతం!

800yearold | నాటి కాకతీయుల ఇంజనీరింగ్ అద్భుతం!

800yearold | కాకతీయుల కాలం నాటి ఘన చరిత్ర
నాటి ఇంజనీరింగ్ అద్భుతం
భక్తుల దాహాన్ని తీరుస్తున్న జీవధార
పర్యాటకులను ఆకర్షిస్తున్న పిల్లలమర్రి
తెలుగు ఇంజనీరింగ్ వైభవానికి నిలువెత్తు నిదర్శనం

800yearold | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్ ; కాలం మారింది.. సాంకేతికత పెరిగింది.. కానీ నాటి కాకతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యం ముందు నేటి ఆధునిక విజ్ఞానం ఇప్పటికీ తలవంచక తప్పడం లేదు. ఇందుకు సజీవ సాక్ష్యంగా సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలోని పురాతన బావి నిలుస్తోంది. మండువేసవిలో 45 డిగ్రీల రికార్డు స్థాయి ఎండలు మండిపోతున్నా, చుట్టుపక్కల జలాశయాలన్నీ అడుగంటిపోతున్నా.. ఈ 800 ఏళ్ల నాటి బావిలో మాత్రం ఐదడుగుల లోతులో ఎప్పుడూ నీరు నిలిచి ఉంటుంది. ఏడాది పొడవునా జీవధారలా ప్రవహిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఈ బావి కథ ఏంటో తెలుసుకుందాం రండీ…

కాకతీయుల కాలం నాటి ఘన చరిత్ర…
క్రీస్తుశకం 1208లో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని కాలంలో ఆయన సేనాని రేచర్ల నమిరెడ్డి ఈ పిల్లలమర్రి గ్రామంలో అద్భుతమైన శివాలయాన్ని నిర్మించారు. తన తల్లి ‘ఎరకసాని’ జ్ఞాపకార్థం ఈ ఆలయానికి “ఎరకేశ్వర స్వామి ఆలయం” అని పేరు పెట్టారు. ఈ ఆలయ నిర్మాణ సమయంలోనే, స్వామివారి నిత్య కైంకర్యాల కోసం, భక్తుల దాహార్తిని తీర్చడానికి ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేకమైన కోనేరు (బావి)ని తవ్వించారు.

నాటి ఇంజనీరింగ్ అద్భుతం..

800yearold

సాధారణంగా మే నెల వచ్చిందంటే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతాయి. వందల అడుగుల లోతు వేసిన బోర్లే ఎండిపోయే ఈ రోజుల్లో, కేవలం కొన్ని అడుగుల లోతు ఉన్న ఈ పురాతన బావి నిండుగా ఉండటం వెనుక కాకతీయుల జలనిర్వహణ సూత్రాలు దాగి ఉన్నాయి.

ఈ బావిని కేవలం ఒక గుంతలా కాకుండా, భూగర్భంలోని సహజ జల ఊటలకు అనుసంధానిస్తూ నాటి శిల్పులు నిర్మించారు. చుట్టుపక్కల ఎంతటి కరవు పరిస్థితులు ఉన్నా, భూగర్భం నుండి నిరంతరాయంగా నీరు ఈ బావిలోకి ఊరుతూనే ఉంటుంది. వర్షాకాలం, శీతాకాలంలో దాదాపు పైవరకు ఉండే ఈ నీరు, అత్యంత కరవు పీడిత వేసవిలో కూడా కనీసం ఐదడుగుల మేర స్థిరంగా నిలిచి ఉండటం విశేషం.

భక్తుల దహాన్ని తీరుస్తూ..
శతాబ్దాలుగా ఈ బావి నీటిని స్థానికులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఎరకేశ్వర స్వామివారి నిత్య అభిషేకానికి, అర్చనలకు కేవలం ఈ బావి నీటిని మాత్రమే ఉపయోగిస్తారు. మహాశివరాత్రి, కార్తీక మాసం వంటి పర్వదినాల్లో ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తుల దాహాన్నిఈ బావి నీరే తీరుస్తుంది.

పర్యాటకులను ఆకర్షిస్తున్న పిల్లలమర్రి
సూర్యాపేట పట్టణానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామం కాకతీయుల శిల్పకళా వైభవానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. పెద్దగా యంత్రాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలోనే ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయకుండా, భూగర్భ జలాల ఉనికిని గుర్తించి కాకతీయులు నిర్మించిన ఈ 800 ఏళ్ల నాటి బావి, నేటి తరానికి ఒక అద్భుత పాఠం. శతాబ్దాలు దాటినా, తరాలు మారినా వత్తని ఈ జలధార నాటి మన తెలుగు ఇంజనీరింగ్ నైపుణ్యానికి మకుటాయమానంగా నిలుస్తోంది.

click here to read వడదెబ్బంటూ డ్రామా…

click here to read more

Leave a Reply