400 Bunks | ఇంధన కొరతపై ఏపీ సీఎం సమీక్ష

400 Bunks | ఇంధన కొరతపై ఏపీ సీఎం సమీక్ష
400 Bunks | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో గత రెండు, మూడు రోజులుగా ఇంధన కొరత వేధిస్తోంది. కొన్ని జిల్లాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్ కొరత ఎక్కువగా ఉంది. బంకులు మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్న బంకుల్లో వాహనదారులు బారులు దీరారు. ఇక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా బోర్డర్లలో ఉన్న ఏపీ గ్రామాల ప్రజలు అక్కడి బంకుల వద్దకు వచ్చి పెట్రోల్,డీజిల్ తీసుకెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంధన కొరతతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే పానిక్ బయ్యింగ్ వల్ల ఒక్కసారిగా 50శాతానికి పైగా డిమాండ్ పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 400 బంకులు మూతబడినట్లు వివరించారు. ఇంధన సరఫరా లేక పెట్రోల్ బంకులు మూతపడినట్లు తెలిపారు. ఆక్వారంగం వారికి పెట్రో ఉత్పత్తుల విక్రయంలో సమస్య తలెత్తుతుందని అధికారులు చెప్పారు. సమస్య పరిష్కారానికి కలెక్టర్లు, ఫిషరీస్ అధికారులు వెంటనే కార్యాచరణ అమలుచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇవాళ (ఆదివారం) సాయంత్రం లోగా నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.
