103 Years | శతాధిక వృద్ధురాలి నేత్రదానం

103 Years | శతాధిక వృద్ధురాలి నేత్రదానం
103 Years | ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన 103 ఏళ్ల నరసమ్మ
శతాధిక వయసులోనూ ఆదర్శం చూపిన నరసమ్మ
కుటుంబ నిర్ణయం అందరినీ కదిలించిన క్షణం
నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపు
అవయవదానంపై అవగాహనకు పిలుపు
103 Years | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మరణించినా ఆ కళ్లు ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాయి.. శతాధిక వయసులోనూ ఆ బామ్మ ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగులు నింపి ఆదర్శంగా నిలిచారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన డోలి నరసమ్మ (103) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, సమాజ హితం కోరి నేత్రదానం చేసేందుకు ముందుకు రావడం అందరినీ కదిలించింది. జనహిత సేవా సమితి సభ్యుడు డోలి సుకుమార్ చొరవతో.. మృతురాలి కుమారులు దశరథ్, విజయ్ కుమార్, శేఖర్, కుటుంబ సభ్యులు నరసమ్మ నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు. సమాచారం అందుకున్న ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ వెంటనే చేరుకుని నేత్రాలను సేకరించారు. ఈ నేత్రాల ద్వారా ఇద్దరు అంధులకు కంటిచూపు లభించనుంది.

ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ.. డోలి నరసమ్మ కుటుంబ సభ్యుల నిర్ణయం ఎంతో అభినందనీయమన్నారు. ఇది తమ సంస్థ ద్వారా జరుగుతున్న 14వ నేత్రదాన కార్యక్రమమని తెలిపారు. మరణించిన 8 గంటల లోపు కార్నియా సేకరించడం ద్వారా ఇద్దరికి చూపు ప్రసాదించవచ్చని, అలాగే బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అవయవదానం చేయడం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. ప్రజలు అపోహలు వీడి నేత్ర, అవయవ, శరీర దానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఐ బ్యాంక్ తరపున ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
