ఇరిగేషన్ ప్రాజెక్టుల ఫొటో గ్యాలరీని పరిశీలించిన సీఎం
ఇరిగేషన్ ప్రాజెక్టుల ఫొటో గ్యాలరీని పరిశీలించిన సీఎం
మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంపై అధికారుల వివరణ
లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం: ముఖ్యమంత్రి
మక్తల్, ఆంధ్రప్రభ: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. భీమా, కృష్ణా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిని ఆయన గురువారం పరిశీలించారు.
కర్ణాటక మంత్రి బోసు రాజుతో కలిసి బెంగళూరు నుంచి నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, డాక్టర్ వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పూలబొకే అందజేసి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టుల ఫొటో గ్యాలరీని ముఖ్యమంత్రి వీక్షించారు. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా–కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీ పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఫొటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్ ద్వారా ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రాజెక్టు పనుల ప్రస్తుత స్థితి, భవిష్యత్ కార్యాచరణ, సాగునీటి లక్ష్యాలపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తయ్యేలా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించినట్లు సమాచారం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ల బాలకృష్ణారెడ్డి, ఇరిగేషన్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
