Temperatures | వడదెబ్బకు అప్రమత్తతే ఆయుధం..

Temperatures | వడదెబ్బకు అప్రమత్తతే ఆయుధం..
- పెరుగుతున్న ఎండలపై వైద్యుల హెచ్చరిక
Temperatures | ఆంధ్రప్రభ ప్రతినిధి, అవుకు : రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతోంది. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత కఠినంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అవుకు ప్రాంతానికి చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ అభినయ్ ప్రకారం, శరీరం అధిక ఉష్ణోగ్రతలకు గురికావడం, నీటి లోపం (డీహైడ్రేషన్), ఎండలో ఎక్కువసేపు శారీరక శ్రమ చేయడం వంటి కారణాల వల్ల వడదెబ్బ సంభవిస్తుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటే ప్రాణాపాయం కూడా ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
వడదెబ్బ నుంచి రక్షణ పొందాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకం. ముఖ్యంగా గని కార్మికులు, మహిళా కూలీలు, ఎండలో పనిచేసే వారు టోపీలు, గుడ్డలు వంటి రక్షణ వస్తువులు తప్పనిసరిగా వినియోగించాలని సూచిస్తున్నారు.
శరీర ఉష్ణోగ్రత 45 డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగి చెమట పట్టడం ఆగిపోతే అది ప్రమాదకర స్థితి. అలాంటి సందర్భాల్లో వెంటనే వైద్య చికిత్స పొందాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఎండకాలంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. పండ్ల రసాలు, తాజా జ్యూసులు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. అయితే చేపలు, గుడ్లు, చికెన్ వంటి మాంసాహార పదార్థాలను తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే ధూమపానం, మద్యపానం, ఫాస్ట్ ఫుడ్స్, అధిక నూనె పదార్థాలు, మసాలా ఆహారం తీసుకోవడం నివారించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండను వీలైనంతవరకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లినపుడు తగినంత నీరు తాగడం, గొడుగు, టోపీ లేదా హెల్మెట్ ధరించడం అవసరం. బిగువైన దుస్తుల బదులు వదులైన దుస్తులు ధరించడం మంచిది. రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు లీటర్ల వరకు నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు.
పుచ్చకాయ, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మామిడి రసంలో ఉప్పు, జీలకర్ర కలిపి తీసుకోవడం కూడా వడదెబ్బ నివారణకు ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. కళ్లకు ఎండ తగలకుండా సన్‌గ్లాసెస్ ఉపయోగించడం మంచిదని తెలిపారు.
ఒకవేళ వడదెబ్బ తగిలితే వెంటనే బాధితుడిని చల్లని ప్రదేశానికి మార్చాలి. అవసరమైతే ఏసీ గదిలో ఉంచాలి. శరీరంపై చల్లని నీరు చల్లడం, తడిబట్టతో తుడవడం, చల్లని నీటితో స్నానం చేయించడం వంటి చర్యలు తీసుకోవాలి. నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు, పండ్ల రసాలు ఇవ్వడం ద్వారా శరీరానికి ద్రవాలు అందించాలి.
వృద్ధులు, చిన్నారులు ఈ కాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రతను నిర్లక్ష్యం చేయకుండా, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ నుంచి సురక్షితంగా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
