న్యూ ఢిల్లీ – పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ మన గోల్డెన్ టెంపుల్‌ని టార్గెట్ చేసింది. మే 7–8 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించిందని 15వ పదాతిదళ విభాగం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి నేడు వెల్లడించారు.
పాకిస్తాన్‌కు చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలు లేవని, అందుకే భారతదేశంలోని పౌర, మతపరమైన ప్రదేశాలపై కూడా దాడి చేయాలని భావించిందని భారత ఆర్మీ సీనియర్ అధికారి చెప్పారు.”పాక్ సైన్యానికి ఎటువంటి చట్టబద్ధమైన లక్ష్యాలు లేవని తెలిసి, వారు భారత సైనిక స్థావరాలను, మతపరమైన ప్రదేశాలు సహా పౌర లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుంటారని మేము ఊహించాము” అని ఆయన చెప్పారు. “వీటిలో, గోల్డెన్ టెంపుల్ అత్యంత ప్రముఖంగా కనిపించింది” అని ఆయన అన్నారు.
గోల్డెన్ టెంపుల్‌కు సమగ్ర వాయు రక్షణ కవచాన్ని రూపొందించడానికి తాము అదనపు ఆధునిక వాయు రక్షణ వ్యవస్థను ఉపయోగించామని మేజర్ జనరల్ శేషాద్రి అన్నారు. మే 8 తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. చీకటి ముసుగులో పాకిస్తాన్ డ్రోన్లు, దీర్ఘ-శ్రేణి క్షిపణులను ఉపయోగించి పెద్ద ఎత్తున వైమానిక దాడిని ప్రారంభించింది. పాకిస్తాన్ మానవరహిత వైమానిక ఆయుధాలతో, ప్రధానంగా డ్రోన్లు, దీర్ఘ-శ్రేణి క్షిపణులతో భారీ వైమానిక దాడి చేసింది” అని ఆయన అన్నారు. అయితే, భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని, అందుకే వచ్చిన అన్ని ముప్పులను అడ్డుకుని నాశనం చేసిందని ఆయన అన్నారు.
“మేము దీనిని ముందే ఊహించినందున తాము పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాము. శక్తివంతమైన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్లు పాకిస్తాన్ సైన్యం తలపెట్టిన దుర్మార్గపు దాడిని తిప్పికొట్టాయి. స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్లు, క్షిపణులను పేల్చివేసాం. అందువల్ల, మన పవిత్ర స్వర్ణ దేవాలయంపై ఒక గీత కూడా పడకుండా,” అడ్డుకోగలిగాం అని అధికారి చెప్పుకొచ్చారు.
కాగా, మనకున్న ఆకాష్ క్షిపణి వ్యవస్థ, L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ వంటి వాటితో కూడిన మన వైమానిక రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డగించి, స్వర్ణ దేవాలయం, ఇంకా పంజాబ్ అంతటా ఉన్న కీలక నగరాలను ఎలా రక్షించాయో చూపించడానికి భారత సైన్యం ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది.