యాదగిరిగుట్టలో ‘తిలకం’ తంతు..

యాదగిరిగుట్టలో ‘తిలకం’ తంతు..
- భక్తుల ముందే ప్రైవేట్ వ్యక్తుల వీధి పోరాటం!
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొండపై భక్తిభావం వెల్లివిరియాల్సిన చోట పైసల వేట పరాకాష్టకు చేరింది. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నుదుటిన తిలకం దిద్ది, ఆశీర్వచనాలు అందించాల్సిన కొందరు ప్రైవేట్ వ్యక్తులు.. డబ్బుల వసూళ్ల విషయంలో బరితెగించి కొట్లాటకు దిగారు. ఎవరు ఎక్కువ వసూలు చేయాలన్న పోటీలో భాగంగా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతుండటంతో క్షేత్ర పవిత్రత కాస్తా రచ్చకెక్కినట్లయింది. సాధారణంగా కొండపైకి వచ్చే భక్తులకు బొట్టు పెట్టి దక్షిణ అడగడం ఇక్కడ నిత్యం కనిపించే దృశ్యమే. అయితే, శనివారం నాడు ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది.
భక్తుల నుంచి నగదు వసూలు చేసే క్రమంలో ప్రైవేట్ వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం కాస్తా బాహాబాహీకి దారితీసింది. పవిత్ర పుణ్యక్షేత్రం అని కూడా చూడకుండా భక్తుల ముందే వీరు పోటాపోటీగా గొడవకు దిగడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. మరోవైపు, ఈ వింత పోకడను చూసిన భక్తులు ఆశ్చర్యపోతూ, వారి తీరును చూసి నవ్వుకుంటూ వెళ్లిపోవడం గమనార్హం. భక్తి కంటే డబ్బే ప్రధానమన్నట్లుగా సాగుతున్న వీరి తీరు ‘ఆంధ్రప్రభ’ కెమెరాకు చిక్కడంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారులు స్పందించి కొండపై ఇలాంటి అసాంఘిక వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని భక్తులు కోరుతున్నారు.
