- రాష్ట్ర పరిశ్రమలు , వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ.భరత్
treatment | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో పేదలకు వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ఆ మేరకు ఆస్పత్రిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తామని మంత్రి టీ.జీ.భరత్ తెలిపారు. శనివారం ఉదయం సర్వజన ఆసుపత్రిలో రూ. 41 లక్షలు ఖర్చుతో ఆధునీకరించిన 4 గదుల పేయింగ్ బ్లాక్ ను పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ.భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ప్రారంభించారు. అనంతరం మంత్రి టీ.జీ.భరత్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. కర్నూలు సర్వజన ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని.. ప్రస్తుతం పేయింగ్ బ్లాక్ లో నాలుగు గదుల సముదాయాన్ని ఆధునికరించి ప్రారంభించామని, ఇందులో ఒకటి సూట్ రూము, మిగిలినవి మూడు ఏసీ గదులని, ఇవి కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో ఉన్నాయని, డబ్బులు చెల్లించి వినియోగించుకునే వారికి సౌకర్యంగా ఉంటాయని తెలిపారు.
ఇంకా ఆస్పత్రిలో అవసరం మేరకు వివిధ విభాగాల్లో ఆధునిక పేయింగ్ బ్లాకులను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ఎంతోమంది ప్రఖ్యాత డాక్టర్లుగా దేశ విదేశాల్లో సేవలు చేస్తున్నారని తెలిపారు. వారి సలహాలు, ప్రముఖ డాక్టర్లను ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో తీసుకొని వారి సూచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యులు సేవలు, మంచి సౌకర్యాలు ఉన్నందున ప్రక్క నున్న రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వైద్య సేవలు పొందడానికి వస్తూ ఉంటారని వారికి అన్ని సేవలు ఇక్కడ లభిస్తాయని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రెండు మూడు టర్మ్ లు పనిచేయగలిగితే గుజరాత్ ప్రభుత్వం లాగా ఆంధ్రప్రదేశ్ కూడా గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ.. నూతన పేయింగ్ బ్లాక్ మంత్రి అందించిన రూ. 41 లక్షల సీఎస్ఆర్ నిధులతో అందుబాటులోకి రావడం శుభ పరిణామం అని, ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు ఉండటం వలన వీటిని ఐసీయూ లాగా కూడా వినియోగించుకోవచ్చని, డబ్బులు చెల్లించ గల వారికి అందుబాటులో ఉండే విధంగా చార్జెస్ ఉంటాయని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్లేయింగ్ బ్లాక్ విషయం మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లిన వెంటనే సానుకూలంగా స్పందించి తమ టీ.జీ.వీ సంస్థ నుంచి సీఎస్ఆర్ ఫండ్స్ రూపంలో రూ. 41 లక్షల నిధులు అందించి ప్రస్తుతం ఈ బ్లాక్ ఏర్పడడానికి మంత్రి భరత్ కారకులయ్యారని , మూడు నెలల లోపల ఈ పనులు పూర్తయ్యాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టినరసమ్మ, డిప్యూటీ సూపరిండెంట్ లక్ష్మీబాయి, సీఎస్ ఆర్ ఎమ్ పద్మజ, ఆర్ ఎంఓ వెంకటరత్నం, డీసీహెచ్ ఎస్ జఫ్రుల్లా, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రవీణ్, రఘునాథ్ రెడ్డి, జగదీష్ , ప్రదీప్, ఏపీఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి, వారి సిబ్బంది పాల్గొన్నారు.

