
Signature | తప్పుడు సంతకం తీసుకున్న పోలీసులు
Signature | తప్పుడు సంతకం తీసుకున్న పోలీసులు
- ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులు
- ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
Signature | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవ్ అధికార పార్టీ నాయకుల బెదిరింపులతో తీవ్ర మనోవేదనకు గురై ఇవాళ తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ సంఘటనపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు తప్పుడు ఫిర్యాదును సిద్ధం చేసి మృతుడి భార్య సత్యమ్మతో బలవంతంగా సంతకం తీసుకొన్నట్లు తెలియడంతో బీజేపీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
డిఎస్పి లింగయ్య, సిఐ రామ్ లాల్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డితో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు నాగురావు నామాజీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, కొత్త కాపు రతంగ్ పాండు రెడ్డి, శంకరోళ్ళ రవికుమార్, నాయకులు ఎం. భాస్కర్ ,జి. బలరాం రెడ్డి, బి.రాజశేఖర్ రెడ్డి తదితరులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఫిర్యాదు తీసుకునే ముందు మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చిన ఆధారంగా కేసు నమోదు చేయాల్సిన పోలీసులు మీరే ఫిర్యాదులు సిద్ధం చేసి ఫిర్యాదులో ఏమున్న అంశం కూడా మృతుడి కుటుంబ సభ్యులకు తెలియకుండా మృతుడి భార్యతో సంతకం ఎలా తీసుకుంటారని డిఎస్పీని నిలదీశారు.
మీరు తీసుకున్న ఫిర్యాదు బయటపెట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అందుకు పోలీసులు ససేమిరా అనడంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదం దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది .ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ పోలీసులు అధికార పార్టీ నాయకులు మంత్రి ఒత్తిడితో కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు భార్యతో బలవంతంగా సంతంకం తీసుకోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని లేదంటే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అవసరమైతే పోలీసులపై క్రిమినల్ చర్యలకు కూడా బీజేపీ సిద్ధమని వారు స్పష్టం చేశారు.
