సీ ప్లేన్‌పై అవగాహన లేకుండా విమర్శలు తగవు

సీ ప్లేన్‌పై అవగాహన లేకుండా విమర్శలు తగవు
అది ట్రయల్ రన్ మాత్రమేనని స్పష్టం చేసిన టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : సీ ప్లేన్ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన లేకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సమంజసం కాదని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె స్పందించారు.
సీ ప్లేన్ అనేది భూభాగం కాకుండా నీటి ప్రాంతాల్లో ప్రయాణ సౌకర్యం కల్పించే ఆధునిక రవాణా విధానమని ఆమె వివరించారు. దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఈ ప్రాజెక్టుతో కలుగుతుందని తెలిపారు. 2017లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.
అనంతరం వైఎస్సార్‌సీపీ పాలనలో ఈ ప్రాజెక్టు విస్మరించబడిందని విమర్శించారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
విజయవాడ నుంచి శ్రీశైలం వరకు ఇటీవల నిర్వహించిన సీ ప్లేన్ ప్రయాణం ప్రారంభోత్సవం కాదని, కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ట్రయల్‌ను పరిశీలించారని తెలిపారు.
ట్రయల్ విజయవంతం కావడంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సీ ప్లేన్ సేవలను విస్తరించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన లేకుండా రాజకీయ విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షం ప్రజా సమస్యలపై సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని గుడిసె ఆదికృష్ణమ్మ కోరారు.
