లాజిస్టిక్ హబ్‌గా శ్రీకాకుళం …

లాజిస్టిక్ హబ్‌గా శ్రీకాకుళం …
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
పెద్దపాడు జాతీయ రహదారి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం
రూ.4.64 కోట్ల నిధులతో కల్వర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : గ్రామాలకు, పట్టణాలకు అనుసంధానం చేసే విధంగా రహదారులను పెంచడం ద్వారా లాజిస్టిక్ హబ్ గా శ్రీకాకుళం ను మార్చుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రం.. పెద్దపాడు దగ్గర చెన్నై కలకత్తా నగరాలను కలిపే కీలకమైన జాతీయ రహదారిలో.. కల్వర్ట్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలసి శంకుస్థాపన చేశారు. రూ.4.64 కోట్ల రూపాయిల నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ కల్వర్ట్ ను రెండు నెలల్లోగా పూర్తి చెయ్యాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు.
ఈ కల్వర్టు నిర్మాణం లేక స్థానికులకు, వివిధ సంస్థల యాజమాన్యాలకు వర్షాకాలం సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యకు.. తాత్కాలిక పరిష్కారం కాకుండా.. శాశ్వతంగా ఇబ్బంది లేకుండా చేసేందుకు తాను అనేక ప్రయత్నాలు చేసానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి దృష్టిలో సమస్య తీవ్రతను ఉంచి.. నిధుల విడుదల దిశగా విజయం సాధించామని అన్నారు.

రెండు నెలల్లోనే పూర్తి చేసి.. శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు. గతంలో ఎన్డియే హాయంలో నాడు వాజ్ పేయ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో.. తన తండ్రి దివంగత ఎర్రంనాయుడు గోల్డెన్ ప్రాజెక్ట్ ను ఆనాడు జిల్లాకు సాధించి పెట్టారని.. నాలుగు వరుసల జాతీయ రహదారి ఆనాడు నిర్మాణం జరగడంతో అభివృద్ధి దిశగా ఆనాడు బలమైన అడుగు సిక్కోలు జిల్లా వేసిందని రామ్మోహన్ నాయుడు అన్నారు.
తన తండ్రి ఆశయానికి కొనసాగింపుగా.. తాను.. ఆ నాలుగు వరుసల జాతీయ రహదారిని.. ఆరు వరుసల జాతీయ రహదారిగా మార్చుతున్నానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే నరసన్నపేట వరకు విస్తరణ జరుగగా.. సమీప భవిష్యత్ లోనే.. నరసన్నపేట నుండి ఇచ్చాపురం వరకు ఆరు వరుసల జాతీయ రహదారిని విస్తరించనున్నామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. జాతీయ రహదారులపై చాలా అరుదుగా కనబడే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను జిల్లాలో ఇప్పటికే గురజాడ కళాశాల వద్ద స్థానిక గ్రామాల అవసరాల మేరకు ఏర్పాటు చేశామని.. జిల్లాలో మరో అయిదు చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కూడా త్వరలో ఏర్పాటు చేయ్యనున్నట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
వీటికి ర్యాంప్ లను కూడా అనుసంధానం చేస్తామని తెలిపారు. నవ భారత్ కూడలిలో ఫ్లై ఓవర్ అవసరాన్ని ఇప్పటికే నితిన్ గడ్కరికి వివరించామని.. త్వరలోనే వాటికి సంబంధించి కూడా నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. నవ భారత్ కూడలి, కొత్త రోడ్డు కూడలి, పెద్ద పాడు కూడళ్ల లో సుందరీకరణను అభివృద్ధి చేసి.. శ్రీకాకుళం నగరంలోకి వచ్చే వారికి ప్రశాంతమైన ఆహ్వానం లభించేలా చేస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
లాజిస్టిక్ హబ్ గా శ్రీకాకుళం జిల్లాను మార్చుతున్నామని తెలిపిన రామ్మోహన్ నాయుడు.. పోర్ట్ కనెక్టివిటి పెంచితే దానికి సంబంధించిన సంస్థలు, ఎయిర్ పోర్ట్ రవాణా అందుబాటులో ఉంచితే ఐ.టి సెక్టార్ జిల్లాకు సమీపంలో అభివృద్ధి చెందుతాయని. ఆ దిశగా తమ కార్యాచరణ అమలు చేసుకుంటూ వెళ్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా చరిత్రలో తొలిసారి శ్రీకాకుళం నుండి తిరుపతికి రైలు సర్వీసు కూడా ఇదే రోజున ప్రారంభం చేసుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ , ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులు, కూటమి శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు.
