ఆధ్యాత్మికం, ఆహ్లాదం, అభివృద్ధిల మేలుకలయికగా ఇంద్రకీలాద్రి

ఆధ్యాత్మికం, ఆహ్లాదం, అభివృద్ధిల మేలుకలయికగా ఇంద్రకీలాద్రి
ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికత, ఆహ్లాదం అభివృద్ధిల అద్భుత మేలుకలయికగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశం మేరకు, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి లక్ష్మి పార్ధసారధి భాస్కర్ ఆదేశాలతో ఒక ప్రత్యేక నిపుణుల బృందం శుక్రవారం ఇంద్రకీలాద్రిని సందర్శించింది. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ‘కన్హ శాంతివనం’ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నిపుణులు డాక్టర్ రమాకాంత, శరవణన్, శరత్ లతో పాటు అమరావతి అభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్ ఈ బృందంలో ఉన్నారు.
దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మానసిక ప్రశాంతతను అందించేలా కొండపై పచ్చదనాన్ని పెంపొందించడంపై ఈ బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆలయ ఈవో శీనా నాయక్ తో కలిసి నిపుణుల బృందం కింది ప్రాంతాల్లో పచ్చదనం పెంపుదలకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసింది. శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయ పరిసరాలు. కనకదుర్గ నగర్ నుండి మహా మండపం వరకు ఉన్న మార్గం.

ఘాట్ రోడ్ రిటైనింగ్ వాల్ నుండి ప్రధాన ఆలయం వరకు. ఘాట్ రోడ్ దిగువ ప్రాంతం మౌనస్వామి ఆలయం వెనుక భాగం పరిశీలన చేశారు. ఆలయ ఈవో శీనా నాయక్ దేవస్థానం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను బృందానికి వివరించారు. ఈ ప్రణాళికలో భాగంగా ఇంద్రకీలాద్రిని ఒక పర్యావరణ హితమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చేందుకు నిపుణుల బృందం తమ సూచనలను అందజేయనుంది.

అత్యున్నత ప్రమాణాలతో ఇంద్రకీలాద్రి రూపురేఖలను మార్చి, భక్తులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ పనులు సాగనున్నాయని, ఆలయ అభివృద్ధికి పలు సూచనలు చేస్తామని,తగు ప్రతిపాదనలతో దేవాదాయ కమిషనర్ దృష్టిలో ఉంచి సంయుక్తంగా ముందుకు సాగుతామని బృంద సభ్యులు తెలిపారు.

