Pawan Kalyan | టీ పోలీసులకు పవన్ విన్నపం

Pawan Kalyan | టీ పోలీసులకు పవన్ విన్నపం
Pawan Kalyan | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు వెల్లడించారు. సమావేశానికి పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మూడున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారుల త్యాగాలు, యువత బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు.
‘జనసేనకు పోరాట స్ఫూర్తి ఇచ్చింది తెలంగాణే’
జనసేన పార్టీ ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ నేల నుంచే పోరాట పటిమ, ప్రజా సమస్యలపై స్పందించే తత్వాన్ని జనసేన పుణికి పుచ్చుకుందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల సంక్షేమం, యువత ఆశయాలు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగితే ధైర్యంగా గళం విప్పే లక్షణం తెలంగాణ సమాజంలో ఉందని, అదే స్ఫూర్తి జనసేన శ్రేణుల్లో కూడా నిండి ఉందని చెప్పారు.
బలిదానాలకు నివాళి
తెలంగాణకు ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వం ఉందని పవన్ కొనియాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉద్యమకారులు, యువతకు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.

