No Stock | తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ క‌ష్టాలు

No Stock | తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ క‌ష్టాలు

No Stock | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వాహ‌న‌దారుల‌కు మ‌ళ్లీ పెట్రోల్‌, డీజిల్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఇరాన్‌, ఇజ్రాయిల్‌, అమెరికా యుద్దం నేప‌థ్యంలో గ‌త నెల ఇంధ‌న కొర‌త ఏర్ప‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. కొంత ప‌రిస్థితి చ‌క్క‌బ‌డింది అనుకునేలోపు మ‌ళ్లీ స‌మ‌స్య మొద‌టికి వ‌చ్చింది. గ‌త కొన్ని రోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డిజిల్ కొర‌త ఏర్ప‌డింది. ఏపీలో డీజీల్, పెట్రోల్‌ దొరకక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్యంగా డీజిల్‌ సమస్య ఎక్కువగా ఉంది. బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 4,510 బంకులు ఉండ‌గా, అందులో 70 శాతానికిపైగా పెట్రోల్‌, డీజిల్ లేక మూతబడిన‌ట్లు అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి.

నిన్న ఈ రోజు తెలంగాణ‌లోనూ ఆ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు ద‌ర్శ‌నమిస్తున్నాయి. కొన్ని బంకులు మూసేశారు. దీంతో ఇంధ‌నం ఉన్న చోట బంకుల వ‌ద్ద వాహనాలు బారులుతీరాయి. గంటల తరబడి పెట్రోల్ కోసం వాహ‌న‌దారులు నిల‌బ‌డాల్సి వ‌స్తోంది. ఎదురు చూపుల తర్వాత అరకొర ఇంధనంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో ఇంధన కొరత లేదు.. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాలశాఖ చెబుతున్నప్పటికీ పలుచోట్ల పెట్రోల్‌ బంకుల్లో మాత్రం ‘నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో డీజిల్, పెట్రోల్‌ కొరతతో పలు బంకులను తాత్కాలికంగా మూసివేశారు. ఖమ్మం నగరంతో పాటు అశ్వారావుపేట మండలం వినాయకపురం బంకు వద్ద.. కల్లూరు, మణుగూరు, సత్తుపల్లిలో పెట్రోల్‌ కోసం వాహనదారులు బారులుతీరారు. వేంసూరు ఐఓసీ బంకు దగ్గర అయితే పెద్దపెద్ద డబ్బాల్ని వరుసలో పెట్టారు. హైదరాబాద్‌లో హిమాయత్‌నగర్‌ సహా కొన్నిచోట్ల బంకుల్లో నో స్టాక్‌ బోర్డు పెట్టారు. మిగతాచోట్ల పరిస్థితి సాధారణంగానే ఉంది. సూర్యాపేట జిల్లాలో పదిహేనుకుపైగా పెట్రోల్‌ బంకులను తాత్కాలికంగా మూసివేసి నో స్టాక్‌ బోర్డు పెట్టారు.

హైదరాబాద్, ఖమ్మం, అశ్వారావుపేట వంటి ప్రాంతాల్లో వాహనాల క్యూలైన్లు ఎక్కువగా ఉన్నాయి. వదంతుల కారణంగా ప్రజలు కంగారుగా వచ్చి ఇంధనం కొనుగోలు చేస్తుండటంతో నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయి. స్టాక్‌ తక్కువగా ఉండటంతో, కొన్ని బంక్‌లలో కారుకు రూ. 1000, బైక్‌లకు పరిమితంగానే ఇంధనం ఇస్తున్నారు. ప్రజలు ఆందోళన పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ ఆదేశించారు. అయితే, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, ఇంధన కొరత లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసినట్లు సమయం పేర్కొంది.

Leave a Reply