వాహనాల ఎల్ఇడి హెడ్ లైట్ల వెలుగులు ప్రమాద హేతువులు
వాహనాల ఎల్ఇడి హెడ్ లైట్ల వెలుగులు ప్రమాద హేతువులు
విజయవాడ, ఆంధ్రప్రభ : వాహనాలకు ఎల్ఇడి కాంతులతో జరిగే ప్రమాదాల నివారణా చర్యలు చేపట్టాలని కోరుతు హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ నగర ట్రాఫిక్ డి.సి.పి. షేక్ షిరీన్ బేగంని కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరివిల్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రధాన కర్యధర్శి డాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ నేడు నగరంలో వాహనాల వినియోగం పెరిగిందని దానితోపాటు రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగాయని ఆవేధన వ్యక్తం చేశారు.
అందులో ముఖ్యంగా వాహనాల ఎల్ఇడి హెడ్ లైట్లలో అతి కాంతివంతమైన ఎల్ ఇ డి లైట్లు కలిగిన వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ఇప్పుడు వాహనాల హెడ్ లైట్లకు అమర్చుతున్న ఎల్ ఇ డి లైట్ల కాంతి నేరుగా ఎదురుగా వస్తున్న వారి కళ్లలో పడటం వల్ల ఎదురుగా ఉన్న రోడ్డు కూడా కనపడని స్థితి. నేడు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఇది కూడా ఒక కారణమని భావించవచ్చునని తెలిపారు. ఎల్ ఇ డి లైట్ల కాంతి నేరుగా కళ్ళలో పడటం వల్ల కంటిచూపు త్వరగా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో గత ఐదు సంవత్సరాలుగా వివిధ రకాల సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తున్న హరివిల్లు ఫౌండేషన్ వారు ఈరోజు విజయవాడ నగర ట్రాఫిక్ డి.సి.పి. షేక్ షిరీన్ బేగంని కలసి వాహనాల హెడ్ లైట్ల విషయంలో ఏమయినా పరిష్కార మార్గాలు ఉంటే వాటిని అమలు చేసేవిధంగా చర్యలు చేపట్టవలసిందిగా అభ్యర్థిస్తూ వినతిపత్రం అందచేశామన్నారు.
అందుకు సానుకూలంగా స్పందించిన డి సి పి షేక్ షిరీన్ బేగం ఈ హెడ్ లైట్ల విషయంలో అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించి త్వరలోనే ఒక పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడమే కాక ఇటువంటి సామాజిక అంశాల పట్ల ప్రజలందరూ కూడా బాధ్యతగా ఉండాలని తెలియచేశారని తెలిపారు. ఈకార్యక్రమంలో హరివిల్లు ఫౌండేషన్ అధ్యక్షులు ఎం.శశికాంత్, కార్యవర్గ సభ్యులు ఎం. బాలసూర్యనారాయణ, జి.ఎన్.బి.అప్పలరాజు, ఎం వి.ఎస్.ఎన్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
