ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లపై పిడుగుల్లా పడుతూ, నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేశారు. టాపార్డర్ బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థిని గడగడలాడించారు.
ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ అభిషేక్ శర్మ ధాటిగా ఆడుతూ.. కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేశాడు. అతనికి జతగా ట్రావిస్ హెడ్ 26 బంతుల్లోనే 50తో అర్థశతకం దంచేశారు. ఇక 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 41 బంతుల్లో 92 పరుగుల భాగస్వామ్యం అందించారు.
ఆ తరువాత ఇదే జోరును కొనసాగించిన ట్రావిస్ హెడ్ – హెన్రిచ్ క్లాసెన్ ద్వయం, రెండో వికెట్‌కు 35 బంతుల్లో 83 పరుగులు జోడించగా… అనంతరం క్లాసెన్ – ఇషాన్ కిషన్ కలసి మూడో వికెట్‌కు మరో 83 పరుగులు (36 బంతుల్లో) చేశారు.
వన్‌డౌన్ గా వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ అసాధారణ ప్రదర్శనతో కేవలం 37 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. మొత్తం 39 బంతుల్లో 105 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ హైదరాబద్ స్కోరుకు వెన్నెముకగా నిలిచింది.
ఇక ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 29 పరుగులు చేస్తే, చివర్లో వచ్చిన అనికేత్ వర్మ ఓ ఫోర్, సిక్స్ తో 12 పరుగులు చేసి నాటౌట్ గా ఇన్నింగ్స్‌ను ముగించాడు.
ఈ విధంగా, ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు తమ బ్యాటింగ్ ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తూ, కోల్‌కతాపై భారీ స్కోర్ నమోదు చేశారు. ఇక, కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో 279 పరుగుల భారీ టార్గెట్ తో కోల్‌కతా జట్టు ఛేజింగ్ కు దిగనుంది.