Inquiry | మిస్ ఇంగ్లండ్ ఆరోపణలు : డీజీ శిఖాగోయెల్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ ; మిస్ వరల్డ్ పోటీలపై వచ్చిన సంచలన ఆరోపణల్లో నిజమెంతో తేల్చేందుకు డీజీ శిఖాగోయెల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు సీనియర్ ఐపీఎస్‌లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.

రెమా రాజేశ్వరి, సైబరాబాద్ ఎస్‌బీ డీసీపీ సాయి శ్రీ నేతృత్వంలో కమిటీ విచారణ చేపట్టింది. పోటీల నిర్వహణపై కంటెస్టెంట్ల నుంచి సమాచారం సేకరిస్తుంది. మిల్లా మాగీ ఆరోపణల్లో నిజమెంతన్నదిపై దర్యాప్తులో తేలనుంది.

!కాగా.. నిన్న షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మిస్ వరల్డ్ పోటీల నుంచి ఓ అభ్యర్థి వైదొలగింది. 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో.. కంటెస్టెంట్ ఇలా మధ్యలో వైదొలగడం ఇదే తొలిసారి. బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలగింది.

ముందు ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట వాడీవేడి చర్చ నడుస్తోంది.

24 ఏళ్ల మిల్లా మాగీ, గత ఏడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది. దీంతో ఆమె ప్రస్తుతం భారతదేశం, హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చింది. మరో వారం రోజుల్లో ఫైనల్ పోటీలు నిర్వహించనుండగా.. ఇప్పుడు ఆమె హఠాత్తుగా వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో తాను పోటీల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వివరించింది మాగీ. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా పోటీదారులను ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్‌తోనే ఉండేలా చేస్తున్నారని.. ఆఖరికి ఉదయం టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

..

అంతేకాక కొన్ని సందర్భాల్లో నైట్ డ్రెస్సులతో ఉండాల్సి వస్తుందని.. సాయంత్రం నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో భాగంగా మేల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తుందని తెలిపింది. ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలంటూ తమ మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించింది. తనని వేశ్యలుగా చూస్తున్నారంటూ మాగీ సంచలన ఆరోపణలు చేసింది.

Leave a Reply